వైసిపిలో నుండి తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించిన నేతల్లో మొదటి వికెట్ పడిపోయింది.  ఫిరాయింపు మంత్రిగా ఖ్యాతిపొందిన నలుగురిలో ఆదినారాయణరెడ్డి బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు.  నిజానికి ఆది చాలా రోజుల క్రితమే బిజెపిలో చేరాల్సింది.

 

కానీ అంతకన్నా ముందే కమలంపార్టీలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపి సిఎం రమేష్ అడ్డుకోవటం వల్లే ఆది జాయినింగ్ లేట్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో 23 మంది టిడిపిలోకి ఫిరాయించారు. వీరిలో నలుగురికి చంద్రబాబునాయుడు మంత్రిపదవులు కూడా ఇచ్చారు. ఈ నలుగురిలో తాజాగా ఆది నారాయణరెడ్డి బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు.

 

ఆది లాగే మరో ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియ కూడా బిజెపిలో చేరుతారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. కానీ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్న అఖిల బిజెపి నేతల ముందు భారీ డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. తనకు రాజ్యసభ ఎంపిగా  అవకాశం ఇవ్వాలని అఖిల షరతు విధించిందట.

 

అఖిల డిమాండ్లు విన్న బిజెపి నేతలు ముందు ఆశ్చర్యపోయినా తర్వాత ఈమె మన పార్టీకి అవసరం లేదని నిర్ణయించుకున్నారట. అఖిల సత్తా ఏంటో మొన్నటి ఎన్నికల్లోనే తేలిపోయింది. పార్టీలోని అందరూ నేతలతోను గొడవలు పెట్టుకునే అఖిల తమ పార్టీలోకి రాకపోవటమే మంచిదన్నట్లుగా స్ధానిక కమలం పార్టీ నేతలు పై స్ధాయికి నివేదిక పంపారట.


సరే అఖిల వ్యవహారం ఏమవుతుందో ఇప్పటికైతే సస్పెన్సే. అదే సమయంలో మరో ఫిరాయింపు మంత్రి ఎన్ అమరనాధరెడ్డి కూడా టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏదో చంద్రబాబు జిల్లాకు వచ్చినపుడో లేకపోతే కబురు పంపినపుడో తప్ప మిగిలిన రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనబడటం లేదు. వ్యవహారం చూస్తుంటే అమర్ కూడా ఏదో రోజు బిజెపిలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. మిగిలింది సుజయ కృష్ణా రంగారావు మాత్రమే.  విజయనగరం జిల్లాలో టిడిపి మొత్తం తుడిచిపెట్టుకుపోయిన కారణంగా అక్కడ ఎప్పుడేమవుతుందో ఎవరూ చెప్పలేకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: