రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నా.. పార్టీ పుంజుకునే ప‌రిస్థితి ఎక్క‌డో లోపిస్తోంది. అనుకున్న‌ది ఒక‌టి అయితే.. జ‌రుగుతున్న‌ది మ‌రొక‌టి.. అనే చందంగా పార్టీ ప‌రిస్థితి త‌యారైంది. మ‌రి ఈ మొత్తం ప‌రిణామానికి కార‌ణ‌మేంటి?  నాయ‌కుల కొర‌త పార్టీని వెంటాడుతోందా?  లేక పార్టీలోనే అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు జ‌రుగుతున్నాయా? అనే విష‌యం కీల‌కంగా మారింది. దీనిపైనే మేదావులు చ‌ర్చిస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. అటు ఏపీ, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ అధికార‌మే ప‌ర‌మావ‌ధి అంటూ.. బీజేపీ అనేక రూపాల్లో ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తోంది. ప్రాంతీయ పార్టీల వ‌ల్ల రాష్ట్రాల‌కు ఒరిగేది ఏమీ ఉండ‌ద‌ని చెబుతోంది.


అదేస‌మ‌యంలో కేంద్రంలో ఉన్నాం కాబ‌ట్టి ఏమైనా చేస్తే.. అది మావ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఇలా కామెంట్లు చేసి స‌రిపెట్టుకోవ‌డ‌మేనా?  అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌స్తోంది. కానీ, బీజేపీని ప‌రిశీలిస్తే.. రెండు రాష్ట్రాల్లోనూ కీల‌క నేత‌లు ఉన్నారు. కేంద్రంలోనూ ఇత‌ర రాష్ట్రాల్లోనూ బీజేపీని ప‌ట్టాలెక్కిస్తున్న‌వారు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ముందుకు వెళ్తున్న‌వారు కూడా ఉన్నారు. అంతేకాదు, ఈ ఇద్ద‌రు కూడా రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన నాయకులే కావ‌డం గ‌మ‌నార్హం. అలాంటి నాయ‌కులు ఉండి కూడా బీజేపీ ఎందుకు చ‌తికిల ప‌డుతోంది? ఎందుకు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగ‌లేక పోతోంది?


ఇప్పుడు విష‌యంలోకి వెళ్దాం.. బీజేపీ అగ్రనేతలు రాంమాధవ్, మురళీ ధరరావులు రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన నాయ‌కులు. కేంద్రంలో మంచి ప‌లుకుబ‌డి, ఇత‌ర రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తెచ్చిన అనుభ‌వం వీరి సొంతం. పార్టీ త‌ర‌ఫున మంచి గ‌ళం కూడా వినిపిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో జన్మించిన మురళీధరరావు పార్టీ కేంద్ర నాయకత్వానికి నమ్మినబంటు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత నమ్మకమైన నేత. గతంలో మురళీధరరావు రాజస్థాన్, జమ్మూకాశ్మీర్ పార్టీ ఇన్ ఛార్జిగా పనిచేశారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రం కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జిగా ఉన్నారు. కర్ణాటకలో తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ మురళీధరరావు సొంత రాష్ట్రమైన తెలంగాణలో బీజేపీ చతికల పడింది.


రామ్ మాధవ్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి చెందిన వ్యక్తి. ఆయన కూడా ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. జమ్మూకాశ్మీర్ లో బీజేపీ, పీడీపీ అధికారం చేపట్టడానికి రాంమాధవ్ వ్యూహమే కారణం. అమిత్ షాకు నమ్మకమైన నేత. అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. అయితే వీరిద్దరి మధ్య విభేదాలున్నాయని చెబుతారు. మురళీధరరావు సొంత రాష్ట్రమైన తెలంగాణలో రాం మాధవ్ తరచూ పర్యటిస్తుంటారు. బీజేపీలోకి చేరికల్లో రాం మాధవ్ కీలక పాత్ర పోషిస్తారు. తెలంగాణ నేతలు సయితం ఎక్కువగా రాంమాధవ్ నే సంప్రదిస్తుండటం విశేషం.


ఈ ప‌రిణామం మురళీధరరావుకు మింగుడుపడటం లేదు. అందుకే ఆయన ఇటీవల రాంమాధవ్ సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా పర్యటిస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఇతర రాష్ట్రాల్లో మీసాలు మెలిసే ఈ ఇద్దరు బీజేపీ నేతలు సొంత రాష్ట్రాలకు వచ్చే సరికి చ‌తికిల ప‌డుతున్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప‌రిస్థితి రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెన‌క్కి అనే చందంగా మారిపోయింద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇలా అయితే.. మ‌రో రెండు టెర్మ్‌ల వ‌ర‌కు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావ‌డం బీజేపీకి మాట‌ల‌కే ప‌రిమితం అవుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: