తెలంగాణలోని హుజూర్ నగర్ ఉపఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నియోజక వర్గంలో గులాబీ పార్టీదే విజయం అని ఆరా సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ లో తెలిపింది. టీఆర్ఎస్ కు 50.48శాతం, కాంగ్రెస్ కు 39.95శాతం, ఇతరులకు 9.57శాతం విజయావకాశాలు ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది.


హుజూర్ నగర్ లోని అన్ని మండలాల్లో టీఆర్ఎస్ కే ఆధిక్యమని తమ సర్వేలో తేలినట్లు ఆరా తెలిపింది. కొన్ని నెలల క్రితం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇక్కడ టీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది. హుజూర్ నగర్‌లో 82.23 శాతం పోలింగు నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. హూజూర్ నగర్ నియోజకవర్గంలో 7 మండలాల్లో 302 పోలింగు కేంద్రాలకు గానూ 2,36,646 ఓటర్లు ఉన్నారు.


వీరిలో 1,16,326 మంది పురుషులు, 1,20,320 మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ 302 పోలింగ్‌ కేంద్రాల్లో 604 బ్యాలెట్ యూనిట్లు, 302 వీవీ ప్యాడ్లు, 369 మంది పోలింగు ఆఫీసర్లు, 372 మంది అసిస్టెంట్ పోలింగు ఆఫీసర్లు, 756 మంది ఓపీఓలు విధులు నిర్వర్తించారు. అక్కడకక్కడా చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగు ప్రశాంతంగా జరిగింది.


ఇక ఉప ఎన్నిక ఫలితాలు ఈ నెల 24న ప్రకటించనున్నారు. అదే రోజు ఉదయం 8గంటలకు కౌంటింగు ప్రారంభం కానున్నది. ఉదయం 11గంటల వరకూ తుది ఫలితాలు వెలువడనున్నాయి. హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన భార్య పద్మావతి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.


అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సైదిరెడ్డిని తమ అభ్యర్థిగా నిలబెట్టింది. బీజేపీ కోటా రామారావుకు బీఫాం ఇచ్చి బరిలో నిలిపింది. టీడీపీ నుంచి చావా కిరణ్మయి బరిలో ఉన్నారు. ఉప ఎన్నికల్లో ముగ్గురు మహిళలతో కలిపి మొత్తం 28 మంది బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: