మరో మారు బ్యాంకులు బంద్ అవుతున్నాయి. బ్యాంకింగ్ కార్యకలాపాలు ఈ రోజు మొత్తం నిలిచిపోనున్నాయి తెల్లారిలేస్తే అనేక అవసరాలు బ్యాంకులతోనే ముడిపడిఉన్నాయి. బ్యాంకులు అంటే డబ్బులు, నిత్య జీవితం అలాగే సాగుతోంది. అటువంటి నేపధ్యం నుంచి చూసుకున్నపుడు బ్యాంకుల సమ్మె అన్నది సగటు మనిషి జీవితంపై పెద్ద దెబ్బగానే భావించాలి.


ఈ రోజు జరిగే బ్యాంకుల బంద్ లో దాదాపు రెండు లక్షల మంది వరకూ ఉద్యోగులు దేశవ్యాప్తంగా పాలుపంచుకుంటారని తెలుస్తోంది. ప్రభుత్వ బ్యాకుల విలీనానికి  నిరసనగా బ్యాంక్ ఉద్యోగులు, సంఘాలు ఈ సమ్మెను నిర్వహిస్తున్నారు. బ్యాంకుల సమ్మె సమంజసమే అయినా ఈ సమయంలో చేయడం వల్ల ఆర్ధికంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు. మొత్తంగా  ఈ నేపధ్యంలో బ్యాంకింగ్   కార్యకలాపాలు నిలిచిపోవడంతో తీవ్రంగా ప్రభావం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు.


ఇదిలా ఉండగా ఆర్బీఐ, ఎస్బీఐతో పాటు కొన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు ఈ బందులో పాల్గొన‌డంలేదని సంబంధిత వర్గాలు తెలియచేశాయి. మొత్తానికి బ్యాంకుల బంద్ ఇపుడు సామాన్యుడి నెత్తిన సమ్మెట పోటుగానే మారిందని చెప్పాలి. వారి  డిమాండ్లు ఎంతవరకూ పరిష్కారం అవుతాయో తెలియదు కానీ ఈ బంద్ ఇబ్బందులు మాత్రం సాదా జనాన్ని ముప్పతిప్పలు పెడుతున్నాయి.


దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను క్రమంగా దెబ్బతీస్తున్నారని, పెట్టుబడివర్గాలకు పాలకులు కొమ్ము కాస్తున్నారని యూనియన్లు చాలాకాలంగా మండిపడుతున్న సంగతి విధితమే. బ్యాంకులలో నిరర్ధక ఆస్తులు పేరుకుపోవడం వెనక పాలకుల దుర్విధానాలే ఉన్నాయని కూడా అంటున్నారు. అదే సమయంలో బ్యాకింగ్ నష్టాలకు మాత్రం వాటిని బాధ్యులను చేస్తూ విలీనం మంత్రాన్ని జపించడం పట్ల ఇపుడు బ్యాంకింగ్ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. అమీ తుమీ తేల్చుకుంటామని అంటున్నాయి.





మరింత సమాచారం తెలుసుకోండి: