తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించటం, అద్దె బస్సులను తీసుకునే విషయం గురించి మాట్లాడతానని జేఏసీ నాయకులతో చెప్పారు. ఆర్టీసీ కార్మికులు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఆర్టీసీ కార్మికులు భయపడొద్దని గవర్నర్ సూచించారు. ఆర్టీసీ జేఏసీ నేతలకు గవర్నర్ ఆర్టీసీ కార్మికుల్లో ధైర్యం నింపాలని సూచించారు. నిన్న గవర్నర్ ను జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, సుధ, వీఎస్ రావు మరియు ఇతర నేతలు కలిశారు. 
 
 ప్రభుత్వం కోర్టు కాపీ అందలేదనే సాకుతో కాలయాపన చేస్తుందని ఆర్టీసీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వానికి హైకోర్టు కార్మిక యూనియన్లను చర్చలకు ఆహ్వానించాలని, ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేయాలని సూచించినప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదని జేఏసీ కార్మికులు చెప్పారు. 25 శాతానికి మించి అద్దె బస్సులను తీసుకోవటానికి వీల్లేదని నిబంధనలు ఉన్నాయని జేఏసీ నాయకులు గవర్నర్ తో చెప్పారు. 
 
అద్దె బస్సుల టెండర్ ప్రక్రియను రద్దు చేయించాలని గవర్నర్ కు జేఏసీ నాయకులు సూచించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతి లేకుండానే ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఒక్కటై 1,035 అద్దె బస్సులకు టెండర్ జారీ చేసిందని అన్నారు. గవర్నర్ తమిళిసై జేఏసీ నాయకులు చెప్పిన అంశాల గురించి స్పందిస్తూ ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. 
 
జేఏసీ నేతలకు కార్మికుల ఆత్మహత్యలు జరగకుండా చూడాలని గవర్నర్ కోరారు. అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీని స్వాధీనం చేసుకోవటం కుదరదని ఆర్టీసీ కార్మికుల ఆస్తి అని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ఆలోచనల్లో భాగంగానే ప్రభుత్వం 1035 అద్దె బస్సుల కోసం టెండర్లు పిలవడం జరుగుతోందని అన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం ఆలోచించటం లేదని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: