మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికలు ముగిశాయి.  గత రెండు మూడు నెలలుగా ఎన్నికల కోసం ఆయా పార్టీలు చాలా కసరత్తులు చేశాయి.  హామీలు ఇచ్చాయి. మ్యానిఫెస్టోలు తయారు చేసుకున్నాయి.  ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.  ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు.  డబ్బులు ఖర్చు పెట్టారు.  ఎలాగైతేనేం మొత్తానికి ఎన్నికలు పూర్తయ్యాయి.  ఎన్నికలు పూర్తయ్యిన గంటకే ఎగ్జిట్ పోల్స్ తన సర్వే వివరాలను వెల్లడించింది.  


ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ లో వచ్చినట్టుగానే ఫైనల్ ఫలితాలు వస్తాయి అనడానికి లేదు.  కాకపోతే ఒకటి రెండు తేడాలు వస్తాయేమో అంతకంటే మరేమి ఉండదు.  ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే.. రెండు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగించేలా ఉన్నది.  రెండు రాష్ట్రాల్లో బీజేపీకి భారీ మెజారిటీ వచ్చేటట్టు ఉన్నది.  మహారాష్ట్రలో బీజేపీ 164 స్థానాల్లో పోటీ చేసింది.  ఇందులో 145 వరకు గెలుచుకునే ఛాన్స్ ఉన్నది.  ఒకవేళ అంతకంటే మరో రెండు మూడు స్థానాలు ఎక్కువగా వస్తే.. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యొచ్చు.  


కానీ, బీజేపీ ఎప్పటికి అలా చేయదు.  గత 30 ఏళ్లుగా శివసేన.. బీజేపీలు కలిసే ఉన్నాయి.  కలిసే పోటీ చేస్తున్నాయి.  అదే విధమైన స్నేహాన్ని ఎన్నికల రిజల్ట్స్ తరువాత కూడా పోషిస్తాయి అనడంలో సందేహం అవసరం లేదు.  ఇవి కేవలం ఊహాజనిత ఫలితాలే అని కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ కొట్టి పారేస్తోంది.  తమదే విజయం అని చెప్తోంది.  అటు హర్యానాలోని ఇదే విధంగా చెప్తోంది కాంగ్రెస్.   మరో పార్టీ జేజేపీ కూడా తమదే విజయం అంటోంది.  హర్యానాలో బీజేపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, పంజాబ్ తరహాలోనే అధికారంలోకి వస్తామని హర్యానా కాంగ్రెస్ అంటోంది.  


అయితే, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీకి అనుకూలంగానే తీర్పు ఇస్తున్నాయి.  మొత్తం 90 స్థానాలకు గాను 60నుంచి 77 చోట్ల బీజేపీ విజయం సాధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదు.  ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా అటు మహారాష్ట్రలోనూ, ఇటు హర్యానాలోను బీజేపీ తిరిగి అధికారాన్ని చేపడితే.. దేశంలో మరిన్ని చోట్ల బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు.  త్వరలోనే బీహార్, బెంగాల్, గుజరాత్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది.  బీహార్, గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి.  బెంగాల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ చూస్తున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: