సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ కోపం ఏమాత్రం చల్లారినట్టు లేదు. కార్మికులను చర్చలకు పిలవాలని కోర్టు ఆదేశించినా ఆయన పట్టించుకోవడం లేదు. అంతేకాదు.. పని చేసిన సెప్టెంబర్ నెల జీతం కూడా కార్మికులకు ఇవ్వలేదు. మొదట్లో జీతాలు ఇచ్చేందుకు కూడా సిబ్బంది లేరని కోర్టుకు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్ పాట పాడుతోంది.


ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బుల్లేవని కోర్టుకు తెలపింది. జీతాలు చెల్లించే స్థితిలో తమ కార్పొరేషన్ లేదంటూ ఆర్టీసి యాజమాన్యం హైకోర్టుకు సోమవారం చెప్పింది. కార్మికులకు సెప్టెంబరు జీతాలు చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ టిఎన్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ అభినందకుమార్ షావలి విచారణ చేపట్టారు.


పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ సెప్టెంబరు వేతనాలను చెల్లించలేదని తెలిపారు. బిహార్ నుంచి ఝార్ఖండ్ విభజన సమయంలో 30కి పైగా కార్పొరేషన్లలోని కార్మికులకు జీతాలు చెల్లించని సమయంలో.. తక్షణం చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిందన్నారు. అక్కడ కార్మికులు వేతనాలు అందక ఆత్మహత్యలు చేసుకుంటుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుందన్నారు. ఇక్కడా ప్రస్తుతం అదే పరిస్థితి ఉందన్నారు.


ఆర్టీసీ మొత్తం 49,190 మంది కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే పలువురు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కార్పొరేషన్ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె. రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. కార్పొరేషన్ ఖాతాలోప్రస్తుతం రూ.7.49 కోట్లు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఒక నెల వేతనాలు చెల్లించాలంటే రూ.230 కొట్లు అవసరమని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసిందని, దీనిపై రిపైకౌంటరు ఇవ్వాలంటూ విచారణను ఈనెల 29కి వాయిదా వేశారు. ఈ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: