ఎల్ఐసీ క్ల‌ర్క్‌గా జీవితం ప్రారంభించి రూపం మార్చి వంద‌ల కోట్లు సంపాదించిన‌ విజయ్‌కుమార్‌నాయుడు అలియ‌స్ క‌ల్కి బండారం బ‌ట్ట‌బ‌య‌లు అవుతోంది. వ‌రుసగా నాలుగు రోజుల పాటు కల్కిభగవాన్‌ దంపతులకు చెందిన ఆశ్రమాలు, వ్యాపార సంస్థలపై జ‌రిగిన‌ దాడుల్లో మైండ్ బ్లాంక‌య్యే నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. చెన్నైలోని క‌ల్కీ భ‌గ‌వ‌న్‌కు చెందిన వైట్ లోట‌స్ ప్రాప‌ర్టీల‌పై సోదాలు జ‌రిగాయి. అక్క‌డ ఐటీ శాఖ అధికారులు ఇవాళ‌ భారీ స్థాయిలో న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. ఐటీ సోదాల్లో అధికారులు భారీగా స్వదేశీ, విదేశీ కరెన్సీని, కిలోలకొద్దీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ రూ.93 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ఇందులో రూ.43.9 కోట్ల స్వదేశీ కరెన్సీ ఉన్నట్టు స‌మాచారం. 


చెన్నైతో పాటు హైద‌రాబాద్‌, బెంగుళూరు, చిత్తూరు, కుప్పం ప్రాంతాల్లో ఐటీశాఖ అధికారులు సోదాలు చేశారు. సుమారు 20 కోట్ల విలువైన అమెరికా డాల‌ర్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో మ‌రో 90 కేజీల బంగారాన్ని కూడా ప‌ట్టుకున్నారు.  విదేశీ కరెన్సీలో అత్యధికంగా రూ.18 కోట్లు విలువ చేసే 25 లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నాయన్నారు. వీటితోపాటు 88 కిలోల బంగారం (విలువ రూ.26 కోట్లు), 1271 కేరట్ల వజ్రాలను (విలువ రూ.5 కోట్లు) స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వీటితోపాటు రూ.409 కోట్ల మేర అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించామన్నారు. వీటికి సంబంధించిన పలు కీలక పత్రాలను, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. 


కాగా, ఐటీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో సంచ‌ల‌న అంశాలు పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ``ఇతడు (కల్కి) 1980ల్లో వన్నెస్ పేరుతో ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్, నిర్మాణం, ఆటలు ఇలా అనేక రంగాలకు విస్తరించారు. దేశ, విదేశాల్లో కార్యకలాపాలు ప్రారంభించారు. సంస్థకు చెందిన ట్రస్టుల్లో తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత వంటి వెల్‌నెస్ కోర్సులను, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. వీటిద్వారా దేశ, విదేశాలకు చెందిన వ్యక్తులను ఆకర్షించారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చినవారి ద్వారా భారీగా విదేశీ కరెన్సీని సంపాదించారు. ఈ డబ్బును ఏపీ, తమిళనాడుతోపాటు పలు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టారు. ఐటీ సోదాల నేపథ్యంలో వీటికి సంబంధించిన పత్రాలను ట్రస్టు సభ్యులు ధ్వంసం చేస్తున్నట్టు మాకు సమాచారం ఉంది`` అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లోని ఆశ్రమాల్లో వివిధ రూపాల్లో భారీగా విరాళాలను స్వీకరిస్తున్నారని, ఆ డబ్బును లెక్కల్లో చూపకుండా దాచేస్తున్నారని అధికారులు తెలిపారు. దీంతోపాటు రియల్ ఎస్టేట్‌లో వచ్చిన డబ్బును కూడా నల్లధనంగా మార్చుతున్నట్టు తేలిందన్నారు. మొత్తంగా రూ.500 కోట్లకుపైగా అక్రమాస్తులను గుర్తించామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: