హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులను మరిగే నూనెలో కుళ్లిపోయిన ముక్కలకు మసాలా పూసి మాయ చేస్తున్నాయి. ఫ్రిజ్ లో ఆహారాన్ని పెట్టి వేడి చేసి ఏరోజుకారోజు వేడివేడిగా వినియోగదారులకు వడ్డిస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ప్యారడైజ్, బ్లూ ఫాక్స్ వంటి ప్రముఖ హోటళ్లు కూడా వినియోగదారులకు కుళ్లిన పదార్థాలను వేడి చేసి రకరకాల పేర్లతో వడ్డిస్తున్నాయి. 
 
అధికారులు క్రమం తప్పకుండా హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేయాల్సి ఉంది. కానీ ముడుపులు తీసుకొని అధికారులు తనిఖీలు చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కోటి మందికి పైగా నివశిస్తున్న హైదరాబాద్ నగరంలో ఒక్క ఫుడ్ ఇన్ స్పెక్టర్ కూడా లేకపోవటం వలనే హోటళ్లు, రెస్టారెంట్లు నిబంధనలు పాటించటం లేదనే విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో అధికారులకు రోజుకు 20 ఫిర్యాదులు వస్తున్నట్లు తెలుస్తోంది. 
 
జీ హెచ్ ఎం సీ ఆహార భద్రతా విభాగంలో ప్రస్తుతం ఒక అసిస్టెంట్ ఫుడ్ ఇన్ స్పెక్టర్, ఇద్దరు గెజిటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం అధికారులు చేసిన తనిఖీల్లో ప్యారడైజ్ హోటళ్లలో కూడా నిల్వ చేసిన ఆహార పదార్థాలు ఉన్నాయని, ప్యారడైజ్ హోటళ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని తనిఖీల్లో గుర్తించారు. రంగు, రుచి కోసం చికెన్ 65 మొదలైన వంటకాల్లో రసాయనాలు కలుపుతున్నారని అధికారులు గుర్తించారు. 
 
హోటళ్లు, రెస్టారెంట్లు స్విగ్గీ, జొమాటో ఆన్ లైన్ ఆర్డర్లకు వేరే క్వాలిటీ బిర్యానీ, ఆహార పదార్థాలు ఇస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. అధికారులు కొన్ని హోటళ్లలో మూడు, నాలుగు రోజులపాటు చికెన్, మటన్ నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అధికారులు ప్యారడైజ్ హోటళ్లలో వంట మనుషులు శుచి పాటించట్లేదని లక్ష రూపాయలు, ప్యారడైజ్ కూడలిలోని జెంజెం రెస్టారెంట్ కు 15 వేల రూపాయలు, సరూర్ నగర్ లోని కేఫ్ బహర్ హోటల్ కు లక్ష రూపాయలు, ఎంజీ రోడ్డులోని సూపర్ స్టార్ హోటల్ కు 5 వేల రూపాయలు జరిమానా విధించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: