తెలుగుదేశంపార్టీ, వైసిపిలపై కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పై రెండు పార్టీలు రాష్ట్రానికి పట్టిన పీడ అంటూ విరుచుకుపడ్డారు. ధర్మవరంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ  వైసిపి ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. సరే మొదటి నుండి వైసిపిని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారంటే అర్ధముంది.

 

కానీ టిడిపిలోనే పుట్టి ఎదిగిన సుజనా చౌదరి టిడిపి కూడా ఏపికి పట్టిన పీడ అని అన్నారంటే ఆశ్చర్యంగానే ఉంది.  తనకు రాజకీయ బిక్ష పెట్టిందే తెలుగుదేశంపార్టీ అన్న విషయాన్ని సుజనా మరచిపోయినట్లున్నారు. టిడిపిలో ఉన్నంత కాలం బిజెపిని వ్యతిరేకించిన ఇదే సుజనా మారిన పరిస్ధితుల్లో బిజెపిలోకి ఫిరాయించి ఇపుడు టిడిపిని తిడుతుండటమే విచిత్రంగా ఉంది.

 

నిజానికి కేంద్ర మాజీ మంత్రి బిజెపిలోకి రెండు అంశాల కారణంగా ఫిరాయించారు. మొదటిది తనపై ఉన్న కేసుల్లో అరెస్టు కాకుండా తనను తాను  రక్షించుకోవటానికి. ఇక రెండోది తనకు రాజకీయ భిక్షపెట్టిన చంద్రబాబుపై ఎటువంటి కేసులు నమోదు కాకుండా, విచారణలు, అరెస్టులు జరగకుండా అన్న విషయం అందరికీ తెలిసిందే. వేలాది కోట్ల రూపాయలను బ్యాంకుల నుండి దోచుకున్న సుజనా కూడా నీతులు మాట్లాడేస్తున్నారు.

 

ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన వారు తర్వాత రాచరిక పాలన చేస్తానంటే బిజెపి, ప్రజలు చూస్తు ఊరుకోరని హెచ్చరింకటమే విడ్డూరం. ఎందుకంటే రాచరిక పాలన చేస్తున్నదే నరేంద్రమోడి.  నోట్ల రద్దు, జిఎస్టీ అమలు లాంటి కీలక నిర్ణయలను కూడా ఎవరికీ తెలీకుండా ఒక్కరే తీసుకున్నారు. కనీసం ఆర్బిఐ గవర్నర్, కేంద్ర ఆర్దిక మంత్రికి కూడా ప్రధానమంత్రి నిర్ణయం ప్రకటించే వరకూ నోట్ల రద్దు గురించి తెలీదంటే ఏమనుకోవాలి.

 

ఒకవైపు రాచరిక పాలన చేస్తున్న మోడిని బ్రహ్మాండమంటూ పొగుడుతూ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. పరిపాలన వికేంద్రీకరణలో చంద్రబాబునాయుడు, నరేంద్రమోడికన్నా జగన్ చాలా బెటర్ అనే చెప్పాలి. మంత్రులు, ఉన్నతాధికారులను ఎవరి పనిని వారిని చేసుకోనిస్తున్నారు జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి: