తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విష‌యంలో ప్ర‌భుత్వానికి పెద్ద రిలీఫ్ ద‌క్కింది. నూతన వార్డుల విభజన, జనాభా ప్రక్రియలో ప్రభుత్వ వాదనలపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేయగా చీఫ్ జస్టిస్ ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. పిటిష‌న‌ర్లు చెప్తున్నదానికి.. వాస్తవ పరిస్థితికి పొంతన లేదని.. ఇందులో చాలా సమయాలు ఉన్నాయని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ చట్టబద్దంగా జరగడం లేదని దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ల‌పై హైకోర్టులో సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజా తీర్పు ప్ర‌భుత్వానికి పెద్ద ఊర‌ట అని ప‌లువురు పేర్కొంటున్నారు. 


మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను స‌వాల్ చేస్తూ పిటిషన్ దాఖ‌లు చేసిన వ్య‌క్తి త‌ర‌ఫు న్యాయ‌వాది వాదన వినిపిస్తూ ప్రభుత్వం చెబుతున్న వాదనలు పూర్తిగా అవాస్తవమని, ఇప్పటివరకు ఓటర్ల జాబితా, వార్డుల విభజన సక్రమంగా జరగలేదని తెలిపారు. 75 మున్సిపాలీటీలకు స్టే విధించిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచదర్‌రావు వాదనలు వినిపించారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వార్డుల విభజన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశామని ఆయన కోర్టుకు తెలిపారు. స్టే విధించిన వాటిని వదిలిపెట్టి మిగిలిన మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపిందని, ఈ నేప‌థ్యంలో...ఎన్నిక‌లు సాగేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. 


ప్ర‌భుత్వ వాద‌న‌తో ఏకీభ‌వించిన చీఫ్ జ‌స్టీస్ సార‌థ్యంలోని హైకోర్టు ధర్మాసనం మున్సిపల్ ఎన్నికల ముందస్తు ప్రక్రియను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ఎన్నిక‌లు నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట ల‌భించిన‌ట్ల‌యింది. కాగా,  ఎన్నికలు నిర్వహిస్తే బందోబస్తు ఏర్పాట్లకు తాము సిద్ధమేనని డీజీపీ మహేందర్‌రెడ్డి ఇప్ప‌టికే ఈసీకి స్పష్టం చేశారు. దీంతో భ‌ద్ర‌తా ప‌ర‌మైన స‌మ‌స్య‌లేవీ ఎదురుకాక‌పోవ‌చ్చున‌ని తెలుస్తోంది. ఇక . మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట‌ర్ల‌ జాబితా సవరణ, ప్రింటింగ్ తాజా షెడ్యూల్‌ను తెలంగాణ ఎన్నికల కమిషన్ రూపొందించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు ఏర్పాట్ల‌ను బ‌ట్టి...ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: