తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ సొసైటీ ఫ్రీడం స్కూల్ అనే సరికొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఈ స్కూళ్లలో టీచర్లు గంటల తరబడి బ్లాక్ బోర్డుపై టీచింగ్ చేసే విధానం ఉండదు. పిల్లలు బట్టీ పట్టి చదవాల్సిన అవసరం ఉండదు. ఈ స్కూళ్లలో చదివే పిల్లలకు పాఠ్యాంశ పుస్తకాలుండవు. ఎస్సీ గురుకుల సొసైటీ విద్యార్థులకు ఒత్తిడి లేకుండా బోధన జరగాలని, విద్యార్థులు ఒత్తిడి లేకుండా నేర్చుకోవాలనే లక్ష్యంతో ఈ ఫ్రీడం స్కూళ్లను తీసుకొచ్చినట్లు సమాచారం. 
 
ఈ స్కూళ్లలో విద్యార్థుల నిర్ణయం మేరకే పరీక్షల నిర్వహణ, కార్యాచరణ జరుగుతుంది. ఉపాధ్యాయులు విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. ప్రయోగాత్మకంగా ఎస్సీ గురుకుల సొసైటీ 23 పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో ఈ విధానాన్ని అమలు చేయబోతుందని తెలుస్తోంది. ఫ్రీడం స్కూల్ విధానం విజయవంతమైతే అన్ని గురుకుల పాఠశాలల్లో ఇదే విధానాన్ని అమలు చేయాలని ఎస్సీ గురుకుల సొసైటీ భావిస్తోంది. 
 
ఫ్రీడం స్కూల్ విధానంలో ప్రతి తరగతి గదికి 40 మంది విద్యార్థులు ఉంటారు. ప్రతిరోజు కేవలం నాలుగు పీరియడ్లు మాత్రమే ఉంటాయి. ఒక్కో పీరియడ్ 90 నిమిషాల పాటు ఉంటుంది. తరగతిగదుల్లో నలుగురు విద్యార్థులు ఒక బృందం చొప్పున పది బృందాలు ఉంటాయి. ప్రతి బృందానికి ఒక లీడర్ ఉంటాడు. విద్యార్థులకు బుక్స్ బదులుగా మాడ్యూల్స్ ఉంటాయి. బృందంలోని విద్యార్థులు మాడ్యూల్ లోని అంశాల గురించి చర్చలు జరపడం, లోతుగా పరిశీలించటం చేస్తారు. 
 
స్కిట్స్, డిబేట్స్, క్విజ్, డ్రామా మొదలైన అంశాల ఆధారంగా విద్యార్థులకు మార్కులు పడతాయి. పరీక్షల నిర్వహణకు, బోధనకు విద్యార్థుల ఆమోదం తప్పనిసరి. ప్రస్తుతం చౌటుప్పల్, అడ్డగూడూరు, వరంగల్ ఈస్ట్, వేల్పూర్, చండూరు, ములుగు, సిద్ధిపేట్ రూరల్, ఆర్.ఆర్. గూడెం, గద్వాల్, వెల్దండ, తిరుమలాయపాలెం, చొప్పదండి, షేక్ పేట్, నార్సంగి, చేవెళ్ల, ఆర్కేపురం, శంషాబాద్, కొందుర్గు, సరూర్ నగర్, హయత్ నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, బోథ్ గురుకుల పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: