బైకు లేదా కారు ఉన్న ఎవ‌రిని క‌దిలించినా....ప్ర‌స్తుతం మోగిపోతున్న ఫైన్ల గురించే చెప్తారు. కొత్త మోటారు వాహన చట్టం పేరుతో వ‌సూలు చేస్తున్న జ‌రిమానాలు ఓ రేంజ్‌లో మోత‌మోగిస్తున్నాయి. నిబంధనలు పాటించని వారి పట్ల పోలీసు అధికారులు కొరడా ఝులిపించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీ స్థాయిలో ఛలాన్లు విధించారు. చలాన్ల మోతపై అనేక వ‌ర్గాల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. అయితే, దీనిపై కేంద్రం ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించింది. ఎలాంటి మార్పులు ఈ చ‌ట్టంలో చేయ‌బోమ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. 


కొత్త మోటార్‌ వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌లు, ఇత‌ర‌త్రా అంశాల గురించి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ...``ప్రతీఏటా దాదాపు 5లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో 1.5లక్షల మందికి పైగా చనిపోతుండ‌గా 2.5లక్షల మంది వికలాంగులవుతున్నారు. ఇలాంటి ప్రమాదాలను తగ్గించడానికే కేంద్ర ఈ చట్టాన్ని తీసుకొచ్చింది` అని ఆయన స్ప‌ష్టం చేశారు. `కొత్త మోటారు వాహన చట్టంలో ఎలాంటి మార్పులూ చేయబోం. అయితే... చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించితే జరిమానా విధింపులను ఆయా రాష్ట్రాల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవచ్చు`` అని  వెల్ల‌డించారు.


కొత్త చట్టం ప్రకారం జరిమానా విధింపులపై అన్ని రాష్ట్రాలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఇప్పటి వరకూ ఆయా రాష్ట్రల పరిస్థితులకు అనుగుణంగా జరిమానాలను తగ్గించి ప్రస్తుతం ఐదు రాష్ట్రాలు మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. వాటిల్లో గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, కర్నాటక, అసోం రాష్ట్రాలున్నాయి. 
 పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్​ ప్రభుత్వాలు ఈ చట్టం అమలు చేయబోమని కుండబద్ధలు కొట్టాయి. బీహార్‌లో అమలు చేస్తున్నా.. వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఫైన్లు వేయకుండా హెల్మెట్లు కొనిస్తున్నారు. చెకింగ్​ చేసే చోటే పొల్యూషన్‌ చెక్‌ పోస్ట్‌లు, ఇన్సూరెన్స్‌ సంస్థల ఔట్​లెట్లు పెట్టి సర్టిఫికెట్లను ఇప్పిస్తున్నారు. ఒడిశాలో మూడు నెలల పాటు కొత్త చలాన్లు విధించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: