వర్షం పడిన ప్రతిసారి రోడ్ పక్కన అమ్మే వేడి వేడి మిరపకాయ బజ్జి అంటే ఇష్టపడని వారు ఉండరు.. దీనికి కాస్త మసాలా జోడిస్తే లొట్టలేయడం ఖాయం. కొంచెం ఘాటుగా మరికొంచెం కమ్మగా ఉండే ఈ బజ్జీ రకం మిరపకాయ అచ్చం క్యాప్సికమ్‌ను పోలి ఉంటుంది. కానీ.. సైజులో మాత్రం దానికంటే తక్కువే. కర్ణాటక ప్రాంతంలో సాగయ్యే ఈ అరుదైన రకం తరువాత మచిలీపట్నం సమీపంలోని పోతేపల్లిలో సాగవుతోంది. ఈ రకం మిరపను సాగు చేసి ఇక్కడి కౌలు రైతులు లాభం గడిస్తారు.. అయితే ఈ మిరప గురించి కొన్ని మనం తెలుసుకుందాం.

 

 

మచిలీపట్నంలోని రాజుపేటకు చెందిన ఓ వ్యక్తి కర్ణాటక ప్రాంతం నుంచి ఒక మిరప మొక్కను తీసికొచ్చి సుమారు 50ఏళ్ల క్రితం నాటరట. దాని ద్వారా వచ్చిన విత్తనాలతో రెండు మొక్కల్ని అభివృద్ధి చేసి.. ఒక దానిని పోతేపల్లి గ్రామంలోని రైతుకు ఇచ్చారని చెబుతారు. ఆ ఒక్క మొక్క నుంచి వచ్చిన విత్తనాలతో దాదాపు 40 ఎకరాల్లో సాగు చేపట్టారని.., దీనిని కొన్ని ప్రాంతాల్లో కూర కోసం వాడినా ఎక్కువగా బజ్జీలకే ఉపయగిస్తారని., కృష్ణా, గుంటూరు, విజయవాడ నగరాలతోపాటు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలు, బరంపురం ప్రాంతాల్లో ఈ రకం మిర్చికి డిమాండ్‌ ఎక్కువని., ఇక్కడి నుంచి ప్రతి వారం కనీసం మూడు లారీల కాయలు ఎగుమతి అవుతాయని సమాచారం.. అయితే ఈ రకం మిరపను బుంగ మిరప అని., కొన్ని చోట్ల బుట్ట మిరప అని పిలుస్తారు..

 

 

తొలకరిలోని మిగితా పంటల వలే జూన్‌లో నారు పోసి ఆగస్టులో మొక్కలు నాటుతారు. నాటిన మూడో నెల నుంచి 9వ నెల వరకు దిగుబడి వస్తుంది. అక్టోబర్‌ నుంచి మార్చి వరకూ వారానికోసారి కాయల్ని కోస్తారు. చల్లటి వాతావరణంలో మాత్రమే సాగయ్యే బుంగ మిరపకు ఎకరానికి రూ.3 లక్షల వరకు పెట్టుబడి అవసరం. దీనిని కౌలు రైతులు మాత్రమే సాగు చేసి., ఎకరానికి రూ.40 వేల వరకు కౌలు చెల్లిస్తారు. ఎకరానికి కనీసం 12 లక్షల వరకు కాయల దిగుబడి అవుతుండగా., ఒక్కో కాయను 40 పైసల నుంచి 60 పైసలకు వ్యాపారులు కొంటున్నారు. ఈ కాయ సగటు ధర 50 పైసల వరకు ఉంటుంది. పెట్టుబడి, ఇతర ఖర్చులు పోను ఎకరానికి రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ పంట పోతేపల్లి గ్రామంలో మాత్రమే పండుతుందని., ఇక్కడి విత్తనాన్ని తీసుకెళ్లి పొరుగు గ్రామాల్లో సాగు చేసేందుకు ప్రయత్నించినా విజయవంతం కాలేదని ఇక్కడి రైతులు చెప్పిన సమాధానం..   

మరింత సమాచారం తెలుసుకోండి: