దేశంలో రాజకీయం క్రమంగా రూపు మార్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. మహాత్మాగాంధీ మూసేయమన్న కాంగ్రెస్ దుకాణాన్ని ఇన్నేళ్ళకు మోడీ మూసేస్తున్నాడా అనిపించకమానదు. జరుగుతున్న పరిణామాలు అదే నిజం అనిపిస్తున్నాయి. కాంగ్రెస్ దేశంలో ఇపుడు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉందన్నది నిజం. ఆ పార్టీకి భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా ముందే చెప్పేస్తున్నాయి.


సరే ఎన్నికలు వస్తూంటాయి. పోతూంటాయి. కానీ కాంగ్రెస్ అన్న పార్టీ చరిత్రలో ఉంటుందా, వర్తమానంలో ఉంటుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కీలకమైన రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ తరఫున సరైన ప్రచారం కూడా చేసుకోలేకపోవడాన్ని ఏమనుకోవాలి. పోరాడి ఓడడం వరకూ అంతా ఆమోదిస్తారు. కానీ అసలు సోదిలోకి లేకుండానే చేతులెత్తేయడం దారుణమే.


అందుకే మహారాష్ట్ర, హర్యానాకు సంబంధించి అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి పట్టం కట్టేశాయి. అసలు ఎగ్టిట్ పోల్స్ వరకూ అవసరం లేదు, కాంగ్రెస్ వైఖరి చూస్తేనే వారు గెలిచేందుకు రెడీగా లేరని అర్ధమైపోతోందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకనాడు ఈ దేశాన్ని ఒంటిచేత్తో ఏలింది. అన్ని రాష్ట్రాల్లోనూ జెండా ఎగురవేసిది. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మరణ శయ్య మీదకు రావడం అంటే అంతకంటే బాధాకరం ఏముంటుంది.


మరో వైపు మోడీకి, బీజేపీకి చేదెక్కెలా వరస విజయాలు వస్తున్నాయి. ఈ విజయాల వల్ల ఏకైక పెద్ద జాతీయ పార్టీగా బీజేపీ మిగులుతోంది. ఇది ఓ విధంగా ఆందోళనకరమైన అంశంగా చెప్పుకోవాలి. బీజేపీకి పోటీగా కాంగ్రెస్ నిలబడితే పరవాలేదు కానీ, దేశానికి ఒక్క పార్టీయే దిక్కు అన్న ధోరణి వస్తే మాత్రం అది ప్రజాస్వామ్యానికి ఏమంత మంచిది కాదేమో. కాంగ్రెస్ ఉనికి లో ఉండడం ఇపుడు ఆ పార్టీ కంటే కూడా దేశానికి చాలా అవసరం.


మరింత సమాచారం తెలుసుకోండి: