భారీ వర్షాలతో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి నెల్లూరు జిల్లాలో జలాశయాలు, చెరువులు నిండుకుండలా మారాయి.   రబీ సీజన్‌కు సరిపడా నీరందడంతో, జిల్లా వ్యాప్తంగా ఈసారి 7లక్షల ఎకరాల్లో పంట సాగవుతోంది. అయితే వ్యవసాయ శాఖ  ఇందుకు సరిపడా విత్తనాలు సమకూర్చక పోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ దశలో వ్యాపారులు విత్తన కొరత సృష్టించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. 


పూర్తి స్థాయిలో అయకట్టుకు నీరు వస్తుందనే భరోసాలో వున్న నెల్లూరు జిల్లా రైతులు... ఉత్సాహంగా రబీకి సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 7 లక్షల ఎకరాల్లో వరి సాగుకు సన్నద్ధమయ్యారు. చెరువుల్లో నారుమళ్లకు సరిపడా నీరు చేరడంతో విత్తనాలు సేకరించే పనిలో ఉన్నారు. అయితే  అదిలోనే హంసపాదు ఎదురవుతోంది. విత్తన కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా విత్తన వ్యాపారులు చేస్తున్న దందా రైతులకు కొత్త కష్టాలను తెచ్చి పెడుతోంది. సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచామని అధికారులు  చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. 


జిల్లాలో 2లక్షల50వేల హెక్టార్లకు సంబంధించి సుమారు లక్షా 25వేల క్వింటాలు విత్తనాలు అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 9 ప్రాసెసింగ్ సెంటర్లు ఉన్నప్పటికీ, రైతులకు వరి విత్తనాలను అందించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. విత్తనాల కొరత ఏర్పడటంతో ధరలు అమాంతం పెరిగి పోయాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ ప్రారంభంలో 30 కేజీల బస్తా 960 రూపాయలు అమ్మిన వ్యాపారులు... నేడు 1500 రూపాయలు పెంచడంతో రైతులు లబోదిబోమంటున్నారు.  దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు అన్నదాతలు.


జిల్లా వ్యాప్తంగా 12 వ్యవసాయ డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయాలు వున్నాయి. వీటి పరిధిలోని 46మండలాల్లో వ్యవసాయశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని చెబుతున్నప్పటికీ విత్తన వ్యాపారులు మాత్రం అడ్డగోలుగా దోపీడీ చేస్తూనే ఉన్నారు. విత్తన వ్యాపారుల దందాపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్  శాఖ తనిఖీలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకు జిల్లాలోని నాయుడు పేట, సూళ్లురు పేట,అల్లూరు,డక్కిలి మండలాలలో జరిపిన దాడులలో 4వేల 35 కిలోల బస్తాలను సీజ్ చేసింది. విత్తన ధరలకు కళ్లెం వేసి, సరిపడా సీడ్ అందేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు రైతన్నలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: