సోమవారం 17వ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేశారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడపడానికి చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారు. వేతనాలు లేక ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉందని, తమ ఆవేదన అర్థం చేసుకోవాలంటూ తాత్కాలిక డ్రైవర్లు, కం డెక్టర్లను వేడుకున్నారు. కరీంనగర్‌–1 డిపోకు చెందిన డ్రైవర్‌ జంపన్న ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ, రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల అమలుపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కార్మిక వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది 24 రోజుల సెలవుల తర్వాత పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. దీంతో ప్రయాణికుల తాకిడికి తగినట్టుగా బస్సులు నడపాలని ప్రభుత్వం ఆరీ్టసీని ఆదేశించింది.ఈ క్రమంలో రోజువారీగా నడిపిన వాటి కంటే ఎక్కువ నడపాల్సి ఉండగా.. అధికారులు మాత్రం విఫలమయ్యారు. ఫలితంగా గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది .

విద్యార్థుల బస్‌ పాస్‌లను అన్ని బస్సుల్లో అనుమతించాలని ఆర్టీసీ ఆదేశించినప్పటికీ చాలాచోట్ల పాసులను అనుమతించలేదు., రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 6,276 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ తెలిపింది.ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రతినిధులు  సోమవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని గవర్నర్‌కు వివరించారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదనే అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశంలో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని, చర్చలు జరిపేలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని కోరారు.  తమ వినతిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించినట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు వెల్లడించారు

సమ్మె విషయంలో సర్కారు అనుసరిస్తున్న వైఖ రికి నిరసనగా సోమవారం హైదరాబాద్‌ మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ (ఎంజీబీఎస్‌)లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు.నూరుశాతం బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కండక్టర్లు ప్రయాణికులకు తప్పని సరిగా టికెట్లు జారీ చేయాలని, బస్సు పాసులను అనుమతించాలని స్పష్టంచేశారు. కండక్టర్లకు టిమ్‌ మెషీన్లు ఇవ్వాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: