సిక్కులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న కర్తార్ పూర్ కారిడార్.. వచ్చే నెల ప్రారంభం కాబోతోంది. కర్తార్ పూర్ కారిడార్ విషయంలో రేపు భారత్, పాకిస్తాన్ ఒప్పందం చేసుకోనున్నాయి. గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్ పూర్ కారిడార్ ఓపెన్ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతున్నా.. యాత్రికుల దగ్గర్నుంచి సర్వీస్ ఛార్జ్ వసూలు చేయాలన్న నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. 


ఇప్పటివరకూ కిటికీ లోంచి బైనాక్యులర్ నుంచి చూసి ఆనందించిన కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాను.. ఇకపై సిక్కులు నేరుగా దర్శించుకునే వీలు కలగనుంది. వచ్చే నెల 9న కర్తార్ పూర్ కారిడార్ లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. కారిడార్ పనులు తుది దశకు చేరుకున్నాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. గురునానక్ తుదిశ్వాస విడిచిన ప్రదేశంగా చెప్పుకునే కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాను సిక్కులు పవిత్ర స్థలంగా భావిస్తారు. భారత్ నుంచి వచ్చే సిక్కులు కర్తార్ పూర్ కు వీసా లేకుండానే రావొచ్చనీ.. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ తో గత నెలలో ఒప్పందం కుదుర్చుకుంది. భారత పౌరులైన సిక్కులతో పాటు ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఉన్న సిక్కులు కూడా కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవచ్చు. కర్తార్ పూర్ కారిడార్ లో ప్రయాణించే యాత్రికులు తమ వెంట పాస్ పోర్ట్ లు మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. 


కర్తార్ పూర్ కారిడార్ విషయంలో రేపు భారత్, పాక్ ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. అయితే ఒక్కో యాత్రికుడిపై 20 డాలర్ల సర్వీస్ ఛార్జ్ విధించాలన్న ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని భారత్ పాక్ ను కోరింది. అయితే దాయాది దేశం మాత్రం ససేమిరా అంది. దీంతో ప్రస్తుతానికి పాక్ తో ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ నిర్ణయించింది. భారత్ నుంచి కర్తార్ పూర్ వెళ్లే యాత్రికుల ద్వారా.. సంవత్సరానికి 571 కోట్ల రూపాయల ఆదాయం పొందాలనేది దాయాది దేశం ఎత్తుగడ. 


సిక్కుల విశ్వాసాలతో ఇమ్రాన్ ఖాన్ బిజినెస్ చేస్తున్నారని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ విరుచుకుపడ్డారు. పేద యాత్రికులు అంత సర్వీస్ ఛార్జ్ ఎలా చెల్లించగలుగుతారని వారు ప్రశ్నించారు. జీవితకాలంలో ఒక్కసారైనా కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే యాత్రికుల నుంచి వసూలు చేసే ఫీజుతో.. దేశ ఆర్థిక కష్టాలు కొంతైనా తీరతాయన్న ఇమ్రాన్ ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్తార్ పూర్ కారిడార్ ద్వారా సాధారణ రోజుల్లో ఐదు వేల మంత్రి యాత్రికుల్ని, ప్రత్యేక సందర్భాల్లో మరింత ఎక్కువ మందిని అనుమతిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: