సెప్టెంబర్ 15 వ తేదీన పాపికొండల్లో ప్రయాణం చేస్తున్న రాయల్ వసిష్ఠ బోటు కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురయ్యి మునిగిపోయిన సంగతి తెల్సిందే.  ఆ ప్రమాదంలో దాదాపు 30 మందికి పైగా మరణించగా  చాలామంది గల్లంతయ్యారు.  గల్లంతైన వ్యక్తుల ఆచూకి ఇప్పటి వరకు తెలియలేదు.  దాదాపు 200 అడుగుల లోతులో బోటు మునిగిపోవడంతో బయటకు తీయడం చాలా కష్టంగా మారింది.  దీంతో బోటును బయటకు తీసే బాధ్యతను ధర్మాడి సత్యానికి అప్పగించారు. 

దాదాపు వారం రోజులపాటు నీళ్లలో ఉన్న బోటును బయటకు తీసుకొచ్చే  ప్రయత్నం చేయగా చాలాసార్లు విఫలం అయ్యారు.  దీంతో ఒకానొక దశలో బోటును బయటకు తీసే పనులని విరమించుకోవాలని అనుకున్నారు.  కానీ, లోపల ఉన్న మృతదేహాలు, వారి బంధువులు గుర్తుకు వచ్చి.. ఎలాగైనా సరే రాయల్ వసిష్ఠను బయటకు తీయాలని అనుకున్నారు.  ఐరన్ రోప్ లకు యాంకర్లు కట్టి బోటును బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు.  


రెండు మూడు సార్లు ఐరన్ రోప్స్ సైతం తెగిపోయాయి.  అయితే, చివరి ప్రయత్నం చేయాలి అనుకున్న సమయంలో రాయల్ వసిష్ఠకు సంబంధించిన రైలింగ్ ఒకటి .  దీంతో తప్పకుండా తీయగలమనే నమ్మకం ఏర్పడింది.  నిన్నటి రోజున బోటుకు సంబంధించిన పైకప్పు బయటకు రావడంతో మరింత ధైర్యం వచ్చింది.  దీంతో కాకినాడ నుంచి ప్రత్యేకంగా వచ్చిన డైవర్లు గోదావరి నదిలోపలికి వెళ్లి.. రోపులను బోటుకు కట్టారు.. 


అలా బోటుకు కట్టి దానిని జేసీబీలు సహాయంతో బోటును బయటకు లాగారు.  కాగా, బోటు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో బయటకు వచ్చింది.  అనుకున్నట్టుగానే బోటులోని ఏసీ గదిలోనుంచి మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  బోటును బయటకు వచ్చిన తరువాత ఐదు మృతదేహాలు బయటపడ్డాయి.  ఇంకా లోపల ఎన్ని ఉన్నాయి అన్నది తెలియాల్సి ఉన్నది.  సెప్టెంబర్ 15 వ తేదీన ఈ బోటు 77 మంది ప్రయాణికులతో బయలుదేరగా 39 మంది మరణించారు.  26 మంది ప్రాణాలతో బయటపడ్డారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: