పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.838 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రమంత్రి అమిత్ షాకు వివరించారు. ఏపీకి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీకి వెళ్లిన జగన్ హోం మంత్రి అమిత్ షాతో దాదాపు 45 నిమిషాలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి సంబంధించిన అంశాలపై షాకు జగన్ పూర్తి సమాచారాన్ని అందించారు.  ఏపీకి సంబంధించి పరిష్కరించాల్సిన సమస్యలపై షా సానుకూలంగా స్పందించారని జగన్ వెంట సమావేశానికి వెళ్లిన ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి తెలిపారు. 


   ఈ భేటీలో ముఖ్యంగా పోలవరం రివర్స టెండరింగ్ విధానంపై అమిత్ షాకు జగన్ పూర్తి వివరాలు అందించారు. హెడ్ వర్క్స్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పనులకు సంబంధించి రూ. 780 కోట్లు, టన్నెల్ పనులకు సంబంధించి రూ. 58 కోట్లు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేశామని పేర్కొన్నారు. దీనిపై అమిత్ షా జగన్ ను అభినందించారు. ప్రజాధనాన్ని ఆదా చేయడం మంచి విషయమన్న.. ఏపీకి సంబంధించి అన్ని పనుల్లో తన సహకారం ఉంటుందని జగన్ కు హామీ ఇచ్చారు.

ఏపీకి సంబంధించిన అంశాలపై మిగిలిన శాఖలతో కూడా తాను మాట్లాడతానని జగన్ కు షా తెలిపారు. భేటీలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ షాను కోరారు. కాగా ఈ అమిత్ షా జన్మదినం సందర్భంగా ఏపీ ప్రజల తరఫున సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.   


  ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ ప్రక్రియపై ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తున్న సమయంలో జగన్, షాల భేటీ ప్రాధాన్యత సంతరించుకోగా.. కేంద్రంతో సానుకూలంగా వ్యవహరించి నిధులను రాబట్టుకోవాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నట్టుగా ఈ భేటీని బట్టి తెలుస్తోంది. కాగా జగన్ మంగళవారం రాత్రి గానీ బుధవారం ఉదయం గానీ రాష్ట్రానికి చేరుకునే అవకాశముందని వైసీపీ నాయకులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: