నటనలో మనుషులనే మించిపోతుంది ఈ గుర్రం. ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయో కాని ఈ గురాన్ని చూస్తుంటే చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ అన్న సామెతను ఇది అక్షరాల నిజం చేస్తుందనిపిస్తుంది.. తన పై ఎక్కి సవారిచేస్తారని లేదా తనపై మూటలు పెట్టి మోయిస్తారనుకుంటుందో ఏమో కాని మనుషులు పెట్టే తిప్పలు తప్పించుకునేందుకు నక్క జిత్తుల వేషాలన్ని వేస్తోంది.


తన మాయ చేష్టలతో మనుషులను కూడా మించిపోతోంది. పరిస్థితులకు అనుగుణంగా మారుతూ.. తిండి అంటే ఏనుగులా.. పని అంటే పీనుగులా చేస్తోంది. స్వారీ చేద్దామని ప్రయత్నించగానే.. చనిపోయినట్టు నటిస్తూ ఆస్కార్ స్థాయి నటనను కనబరుస్తోంది. ఈ విషయం ప్రపంచానికి ఎలా తెలిసిందంటే ఫ్రసిస్కో జలసార్ అనే వ్యక్తి ఇటీవల తన ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్టు చేశాడు. అందులో ఒక గుర్రం చేష్టలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దానిపై ఎక్కి స్వారీ చేద్దామనేలోపు వెంటనే కిందపడిపోయి చనిపోయినట్టుగా నటిస్తోంది.


అక్కడి నుంచి మనిషి వెళ్లిపోగానే తిరిగి లేచి మామూలుగా ఉంటోంది. ఇలా ఎన్నిసార్లు స్వారీ చేసేందుకు ప్రయత్నించినా మాట మాత్రం వినడంలేదు. అంతటితో ఆగకుండా బలవంతంగా దానిపైకి ఎక్కాలని ప్రయత్నిస్తే చిన్నపిల్లాడిలా కళ్లు కొట్టుకుంటూ మారాం చేస్తోంది. దీని చేష్టలు చూస్తుంటే మనుషులే కాదు, జంతువులు కూడా పరిస్థితులను బట్టి అనుకూలంగా స్పందిస్తాయని తెలుస్తుంది..


తమకు ఇష్టంలేని పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి దొంగ పనులు కూడా చేస్తాయనిపిస్తుంది.. ఇకపోతే దీని నాటకాలు చూసిన నెటిజనులు దాని నటనకు తప్పకుండా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందేనని కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి గుర్రాన్ని తానెప్పుడు చూడలేదని దాన్ని పెంచుతున్న వ్యక్తి  కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు...


మరింత సమాచారం తెలుసుకోండి: