కచ్చులూరు వద్ద వశిష్ట బోట్ ఆపరేషన్ ముగిసింది. ఎన్నో కష్టనష్టాల కోర్చి ధర్మాడి సత్యం బృందం, మెరైన్ డైవర్లు చేసిన కృషి ఫలించింది. 38రోజులపాటు నదీగర్భంలో చిక్కుకున్న బోటును వెలికితీయగా ఎనిమిది మృతదేహాలు బయటపడ్డాయి. అనంతరం మార్చూరీకి తరలించారు.


తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద నీటమునిగిన వశిష్ట బోట్ ను ఎట్టకేలకు వెలికితీశారు. సెప్టెంబర్ 15న ఈ బోటు నీట మునిగింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 77 మంది ఉన్నారు. వీరిలో 39 మంది మృతిచెందగా 12 మంది గల్లంతయ్యారు. 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. 200 అడుగుల లోతులో ఉన్న బోటును వెలికి తీయాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటి వరకూ ఇలాంటి రిస్కీ ఆపరేషన్‌ నిర్వహించిన చరిత్ర లేదు. అయినా సవాల్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఆ మేరకు పనుల్ని కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందానికి అప్పగించింది.   


వాతావరణ అనుకూలించకపోయినా.... సంప్రదాయ రీతిలో లంగర్‌ వేసి బోటను దాదాపు ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ధర్మాడి సత్యం బృందం సభ్యులు . ఒకానొక సమయంలో ఇనుప రోప్‌ కూడా తెగిపోయింది. అయినా నావీకి చెందిన డైవర్లను  తీసుకొచ్చి.. ఆపరేషన్‌కు తుది రూపు ఇచ్చారు. నేవీ డైవర్లు లోతైన నీటిలోకి వెళ్లి బోటుకు లంగర్‌ వేశారు. నదీగర్భంలో ఇసుకులో కూరుకుపోయిన బోటుకు లంగర్లు, ఐరన్‌ రోప్‌ కట్టి అతికష్టం మీద పొక్లెయిన్‌తో బయటకు లాగారు. 38 రోజులుగా నదీ గర్భంలోనే బోటు ఉండటంతో పూర్తిగా ధ్వంసమైంది. సత్యం బృందం లంగర్‌ వేసిన సమయంలో తొలుత బోటు పైభాగం ఊడొచ్చింది.  ఆ సమయంలోనే తలలేని చిన్నారి మొండెం ఒకటి తేలింది. మరోసారి డైవర్లు వెళ్లి లంగర్‌ వేసినా.. ఇన్నాళ్లూ నీటిలో నానిపోయి ఉన్న బోటు ముక్కలుగా ఊడిపోయింది. బోటుకు చెందిన మరో భాగం బయటకొచ్చింది. 200 అడుగుల లోతులో ఉన్న బోటును అలా మెల్లమెల్లగా ఒడ్డు వరకూ లాక్కొచ్చారు.  


లోతు ఎక్కువగా ఉండటం వల్లే వెలికితీత ప్రక్రియ ఆలస్యమైందని తెలిపారు ధర్మాడి. బోటును వెలికితీసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బోటు వెలికితీతలో విశాఖ స్కూబా డైవర్లు చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టువీడకుండా బోటుకు వెలికితీసిన ధర్మాడి సత్యం బృందానికి, ప్రభుత్వ కృషికి ప్రజలు అభినందనలు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: