ఎట్టకేలకు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకూ చర్చల్లేవ్ అంటూ భీష్మించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త మెత్తబడ్డట్టు తెలుస్తోంది. చర్చలు జరపాల్సిందే అని హైకోర్టు తేల్చి చెప్పడంతో చర్చలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఒక్క కండిషన్ మాత్రం పెడుతున్నారు కేసీఆర్.. అదే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు వదలుకోవాలన్నదే ఆ షరతు.


ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న డిమాండ్ ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్లను పరిశీలించడానికి ఆర్టీసీ ఇ.డి.లతో ఆర్టీసీ ఎండి కమిటీని నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష జరిపారు. ‘‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తేనే చర్చలు జరుపుతామని కార్మిక సంఘాల నాయకులు మొదట ప్రకటించారు. అదే తమ ప్రథమ అవసరం అని కూడా చెప్పారు. కానీ హైకోర్టులో విచారణ సందర్భంగా మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మీదనే పట్టుపట్ట బోమని చెప్పారు. కార్మిక సంఘాల తరుఫున కోర్టులో వాదించిన న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమనే డిమాండ్ నెరవేరితే తప్ప చర్చలకు రామని కార్మికులు ఎప్పుడూ చెప్పలేదన్నారు.


విలీన డిమాండ్ ఒక్కటే ప్రధానం కాదని వారి న్యాయవాది చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కార్మికులు విలీనం డిమాండ్ వదులుకున్నట్లయింది. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఆ డిమాండ్లు పరిశీలించాలి. దానికోసం అధ్యయనం చేయండి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: