ఆర్టీసీ సమ్మె 19 రోజులవుతున్నా ఎక్కడా సడలటం లేదు. కార్మికులు సమ్మె విరమించే ఆలోచన చేయడం లేదు. మరోవైపు టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్లతో బండి నెట్టుకొస్తున్నా.. అవి జనం అవసరాలు తీర్చడం లేదు. దీంతో జనంలో కేసీఆర్ కు చెడ్డపేరు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకే కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.


ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణం వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.


వీటి ద్వారా కాస్త సర్వీసులు మరిన్ని పెంచవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ ఈ అద్దె బస్సులు తీసుకున్నా సర్వీసులు సరిపోయే పరిస్థితి లేదు. అందుకే మరోవైపు కేసీఆర్ ఓ మెట్టు దిగివస్తున్నారు.నిన్నటి వరకూ చర్చల్లేవ్ అంటూ భీష్మించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త మెత్తబడ్డట్టు తెలుస్తోంది. చర్చలు జరపాల్సిందే అని హైకోర్టు తేల్చి చెప్పడంతో చర్చలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఒక్క కండిషన్ మాత్రం పెడుతున్నారు కేసీఆర్.. అదే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు వదలుకోవాలన్నదే ఆ షరతు.


ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న డిమాండ్ ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్లను పరిశీలించడానికి ఆర్టీసీ ఇ.డి.లతో ఆర్టీసీ ఎండి కమిటీని నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


మరోవైపు అద్దె బస్సులు పెంచాలన్న నిర్ణయంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్టీసీ వచ్చే నష్టాలు చాలావరకూ అద్దె బస్సుల కారణంగానే అనేది వారి విశ్లేషణ. కేసీఆర్ తాజా నిర్ణయం ద్వారా ఆర్టీసీ మరింతగా దెబ్బ తింటుందని వారు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: