సాధారణంగా ఎవరికైనా హీరోలు లేదా రాజకీయ నాయకులపై అభిమానం ఉంటే హీరోల, రాజకీయనాయకుల బొమ్మలు అద్దాలపై వేయించుకోవడం, వారి పేర్లను రాయించుకోవడం వింటూనే ఉంటాం. కానీ ఒక యువకుడు మాత్రం ఏకంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరునే నంబర్ ప్లేటుపై రాసుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు కారు నంబర్ ప్లేటుపై నంబర్ బదులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును రాసుకొని తిరుగుతున్న యువకుడిపై కేసు నమోదు చేశారు. 
 
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులో తనిఖీలు జరిగాయి. తనిఖీలు నిర్వహించే సమయంలో ట్రాఫిక్ సిబ్బంది అటుగా వచ్చిన ఒక కారును చూసి షాక్ ఆయ్యారు. ఆ కారు నంబర్ ప్లేటు మీద AP CM jagan అని ఉంది. పోలీసులు కారు యజమని ముప్పిడి రవి రాకేష్ ను ఎందుకు సీఎం జగన్ పేరు నంబర్ ప్లేటుపై రాసుకున్నావని ప్రశ్నించారు. 
 
ముప్పిడి రవి రాకేష్ టోల్ రుసుం, పోలీసుల తనిఖీల మినహాయింపు కొరకు ఈ విధంగా చేశానని పోలీసులకు చెప్పాడు. ఆ తరువాత ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ కారును సీజ్ చేసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. పోలీసులు కారు యజమాని ముప్పిడి రవి రాకేష్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం అని గుర్తించారు. సదరు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది. 
 
పోలీసుల విచారణలో ముప్పిడి రవి రాకేష్ హైదరాబాద్ నగరంలోని ఒక కళాశాలలో బీటెక్ చదువుతున్నాడని తెలిసింది. సీఐ సత్యనారాయణ సొంత వాహనాలపై ప్రముఖుల పేర్లను రాసుకోవటం పోలీసులను తప్పుదోవ పట్టించటమే అని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సత్యనారాయణ చెప్పారు. యేసురెడ్డి అనే పేరు మీద కారు రిజిస్టర్ అయిందని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: