ఎల్‌ఐసీ క్లర్క్‌గా ప్రస్థానం మొదలు పెట్టి ఎన్నో వంద‌ల ఎక‌రాల ఆశ్ర‌మాలు, వంద‌ల కోట్ల రూపాయ‌ల అక్ర‌మ సామ్రాజ్యాల‌ను భగవంతుడి పేరుతో నిర్మించిన విజయ్‌కుమార్ నాయుడు అలియాస్ కల్కీ ఉదంతం ప్ర‌జ‌ల‌కు టోపీ పెడితే...మ‌రికొంద‌రు ఆయ‌నకు టోపీ పెట్టార‌నేది తాజా వార్త‌. భక్తి ముసుగులో వందల కోట్లు అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలపై తమిళనాడులోని కల్కి ఆశ్రమం, ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తలవలం గ్రామ సమీపంలోని కల్కి భగవాన్ ఆశ్రమంలో మంగళవారం తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కోట్ల రూపాయల నగదు, పెద్ద సంఖ్యలో బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే రీతిలో ఓ మ‌హిళ ఆయ‌న‌కు టోపీ పెట్టిన సంగ‌తి తెర‌మీద‌కు వ‌చ్చింది.


విజ‌య్‌కుమార్ నాయుడు 1949 మార్చి 7న జన్మించిన ఆయన మొదట ఎల్‌ఐసీలో క్లర్క్‌గా పనిచేశారు. అనంతరం ఉద్యోగం వదిలేసి స్నేహితుడు శంకర్‌తో కలిసి 1984లో చిత్తూరులో స్థాపించిన జీవాశ్రం స్కూల్‌ను నష్టాలు రావడంతో మూసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయా రు. ఆ తర్వాత విష్ణుమూర్తి పదో అవతారం కల్కి భగవాన్‌గా చెప్పుకుంటూ 1989లో చిత్తూరులో ప్రత్యక్షమై తనతోపాటు తన భార్యను కూడా దైవాంశ సంభూతిరాలిగా పేర్కొన్నారు. క్రమంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆశ్రమాలను విస్తరించారు. అయితే, అనంత‌రం ఆయ‌నకో కోరిక పుట్టింది. ప్రచారానికి ఓ చానల్ కావాలనుకున్నారు. 


చేతిలో డ‌బ్బులు ఉండ‌టంతో...కల్కి దంపతుల దృష్టి హైద‌రాబాద్‌పై ప‌డింది. హైదరాబాద్‌లోని మణికొండలో పంచవటి కాలనీలో ఉన్న స్టూడియో ఎన్ చానల్‌ను కొనుగోలుచేశారు. ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాసరావు దగ్గర నుంచి 2014లో ఏకం కల్కి ఆధ్యాత్మిక కేంద్రం నిర్వాహకుల పేరిట ఈ కోనుగోలు జరిగింది. చానల్‌ను కొనుగోలు చేసిన తర్వాత సీఈవో రూపంలో ఓ మహిళకు ఏకం కల్కి ఆధ్యాత్మిక కేంద్రం నిర్వాహకులు బాధ్యతలు అప్పగించారు. కొద్దికాలానికి జర్నలిస్టులకు వేతనాలు ఇవ్వకుండా గెంటేశారు. కానీ...ఆ పాత్రికేయులకు కోట్లలో వేతనాలు ఇచ్చినట్లు లెక్కల్లో మాత్రం పక్కాగా చూపారు. ఐటీ దాడుల సందర్భంగా ఈ విషయం వెలుగు చూసింది. ఇలా ఇక్కడ దోచిన సొత్తు నుంచి సదరు మహిళా సీఈవో బాగానే వెనకేసుకున్నట్టు స‌మాచారం. దేశవ్యాప్తంగా ఏకం కల్కి ఆధ్యాత్రిక కేంద్రాలు, కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ఐటీ సోదాల్లో భాగంగా స్టూడియో ఎన్‌లోనూ తనిఖీలు చేపట్టిన సంద‌ర్భంగా ఈ షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: