సమ్మె పరిష్కారానికి ఇరువర్గాలు బెట్టు వీడి ప్రయత్నాలు చేయాలన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశాన్ని పక్కనపెట్టి మిగిలిన 21 డిమాండ్లను పరిశీలించాలని  సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్‌ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్నందున దాన్ని పరిగణించాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు.


ఆర్టీసీ సమ్మెపై విచారణ జరుపుతున్న హైకోర్టు.. శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు చేసిన వ్యాఖ్యలను స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే స్పందించాలని నిర్ణయించారు. అధికారులు రెండుసార్లు సీఎంతో సమావేశం కోసం వెళ్లినా.. ఉత్తర్వుల ప్రతి లేకుండా చేసేదేమీ లేకపోవడంతో ముఖ్యమంత్రి కూడా భేటీలో పాల్గొనలేదు. చివరకు మంగళవారం హైకోర్టు ఉత్తర్వులు అందడంతో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తొలుత అధికారులతో సమావేశమయ్యారు.


కార్మికుల డిమాండ్ల పరిశీలనకు కమిటీ వేయాలని ఆదేశించిన సీఎం కేసీఆర్‌.. అదే సమయంలో వెయ్యి అద్దె బస్సులను సమకూర్చుకునేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులకు సూచించారు. వాస్తవానికి ఇప్పటికే అద్దె బస్సుల కోసం అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. దానికి సంబంధించి దాఖలైన టెండర్లను అధికారులు సోమవారం రాత్రి పరిశీలించారు.ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ఆర్టీసీ ఇన్‌చార్జీ ఎండీ సునీల్‌శర్మ ఆరుగురు అధికారులతో కమిటీ వేశారు. ఆర్టీసీ ఈడీ టి.వెంకటేశ్వర్‌రావు అధ్యక్షుడిగా ఈడీలు ఎ.పురుషోత్తం, సి.వినోద్‌ కుమార్, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు ఎన్‌.రమేష్‌లు సభ్యులుగా ఈ కమిటీ ఏర్పడింది. 


‘‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలి. కార్మిక సంఘాల తరఫున కోర్టులో వాదించిన న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ నెరవేరితే తప్ప చర్చలకు కార్మికులు రారని ఎప్పుడూ చెప్పలేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కార్మికులు విలీనం డిమాండ్‌ వదులుకున్నట్లయింది. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. వాటిని పరిశీలించాలి’’అని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: