ఓ తెలుగు ప్ర‌ముఖుడి విష‌యంలో...ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి ఊహించ‌ని ఇర‌కాటం ఎదురవుతోంది. కార్పొరేట్ల ప్రియుడిగా ఇప్ప‌టికే విప‌క్షాలచే విమ‌ర్శ‌లు ఎదుర్కుంటున్న ప్ర‌ధానిని ఇప్పుడు కొత్త నియామ‌కం మ‌రింత టార్గెట్ చేసింది. దీనికి ఓ తెలుగు పెద్దాయ‌న కార‌ణం. ఆయ‌నే...కేంద్ర చీఫ్‌ విజిలెన్సీ కమిషనర్‌ (సివిసి) మాజీ కమిషనర్‌ కెవి చౌదరి. దేశీయ వ్యాపార దిగ్గ‌జం  ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ బోర్డులోకి ఆయ‌న చేరిక సంచ‌ల‌నం సృష్తోంది. సీవీసీ చౌదరి నిర్ణయాలపై దర్యాప్తు చేయాలని ఇప్ప‌టికే వివిధ వ‌ర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. 


చౌదరి 1978 బ్యాచ్‌ ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) బ్యాచ్‌కు చెందినవారు. ఆగస్టు 2014లో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్స్‌ (సిబిడిటి) ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం రెవెన్యూ శాఖకు సలహాదారుగా పని చేశారు. జూన్‌ 2015నుంచి 2019 జూన్‌ వరకు సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ (సివిసి)గా ఉన్నారు. అనంత‌రం తాజాగా ఆయ‌న్ను ఈ ప‌ద‌వికి నియ‌మించారు. రిల‌య‌న్స్  బోర్డు సమావేశంలో చౌదరిని నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ అదనపు డైరెక్టర్‌గా నియమించుకోవడానికి ఆమోదం లభించినట్లు రిలయన్స్‌ పలు రెగ్యులేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. అలాగే ఆయన బాధ్యతలు సంస్థలో ఏ డైరెక్టర్‌తోనూ సంబంధం లేదని పేర్కొంది.


 రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)లో స్వతంత్ర డైరెక్టర్‌గా కె.వి. చౌదరి నియమితులవడంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఘాటుగా స్పందించారు. ``కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన ఆశ్రిత పెట్టుబడిదారులను ప్రజాధనంతో మరింత సంపన్నులుగా చేస్తోంది. ఒకప్పుడు విజిలెన్స్‌ చీఫ్‌ కమిషనర్‌ ఇప్పుడు భారతదేశ అతిపెద్ద కార్పొరేట్‌ కంపెనీ బోర్డులోని డైరెక్టర్‌! ఆ కంపెనీకి సంబంధించి ఆయన గతంలో తీసుకున్న నిర్ణయాలన్నిటిపై దర్యాప్తు చేయాలి`` అని డిమాండ్ చేశారు. కాగా, ఈ వ్యాఖ్య‌ల‌పై ఇటు చౌద‌రి కానీ...అటు రిల‌య‌న్స్ కానీ స్పందించ‌లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: