చేసుకున్న వాడికి చేసుకున్నంత అనే సామెత చంద్రబాబునాయుడుకు సరిగ్గా సరిపోతుంది. అధికారంలో ఉన్నపుడు ఏమి చేసినా చెల్లిపోయి.  ప్రతిపక్షంలోకి రాగానే అపుడు చేసిన పనులే ఇపుడు రివర్సవుతు మెడకు చుట్టుకుంటున్నాయి. కడప జిల్లాలోని జమ్మలమడుగులో నేతల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. టిడిపి సీనియర్ నేత రామసుబ్బారెడ్డి ఈమధ్యనే జగన్మోహన్ రెడ్డిని కలిశారన్న విషయం తెలిసినప్పటి నుండి చంద్రబాబులో టెన్షన్ మొదలైపోయిందట.

  

ఉప్పు-నిప్పు లాంటి ఆదినారాయణరెడ్డి-రామసుబ్బారెడ్డిని ఒకే చోటకి తెచ్చారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేశానని చెప్పుకున్నారు. కానీ ఇపుడా ఇద్దరు కలిసే చంద్రబాబుకు షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.  ఆది నారాయణరెడ్డి ఇప్పటికే బిజెపిలో చేరిపోయారు. ఢిల్లీకి వెళ్ళి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఇక మరో నేత రామసుబ్బారెడ్డి కూడా తొందరలోనే టిడిపికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరగుతోంది.

 

సోమవారం ఉదయం ఎయిర్ పోర్టులో జగన్మోహన్ రెడ్డిని రామసుబ్బారెడ్డి కలిసి మాట్లాడారట. నిజానికి ఈ ఇద్దరికీ ఏమాత్రం పడదు. అయితే వైసిపి తరపున గెలిచిన ఆది టిడిపిలోకి ఫిరాయించటంతో రామసుబ్బారెడ్డి టిడిపిలో నుండి వైసిపిలోకి వచ్చేస్తానని గతంలోనే రాయబారం పంపారు. అయితే వివిధ కారణాల వల్ల రామసుబ్బారెడ్డిని చేర్చుకోవటం కుదరలేదు.

 

కారణాలు ఏవైనా మొన్నటి ఎన్నికల్లో ఆది నారాయణరెడ్డి  కడప ఎంపిగా పోటి చేయగా రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు ఎంఎల్ఏగా పోటి చేశారు. వైసిపి దెబ్బకు ఇద్దరు ఘోరంగా ఓడిపోయారు.  వీళ్ళతో పాటు పార్టీ కూడా ఓడిపోవటంతో  ఇద్దరూ టిడిపిలో ఇమడలేకపోతున్నారు.

 

దాంతో ఎవరికి వారుగా పార్టీలో మద్దతుదారులతో సమావేశాలు పెట్టుకుని భవిష్యత్తుపై చర్చలు మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలోనే ఆది బిజెపిలో చేరిపోవటంలో టిడిపికి రామసుబ్బారెడ్డి ఒక్కడే దిక్కయ్యాడు. అలాంటిది ఆయన కూడా తొందరలోనే టిడిపికి రాజీనామా చేసేయాలని డిసైడ్ అయ్యారట. ఈ నేపధ్యంలోనే జగన్ తో మాట్లాడటం జిల్లాలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. మరి రామసుబ్బారెడ్డి లాంఛనం ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: