కెనడాలో కొన్ని రోజుల క్రితం పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఐదు పార్టీలు పోటీ చేయగా ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లను గెలుచుకోలేకపోయింది. ఐదు పార్టీలలో లిబరల్ పార్టీ అత్యధికంగా 157 స్థానాలను గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలను గెలుచుకుంది. బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ 32 స్థానాలను, ఎన్.డీ.పీ పార్టీ 24 స్థానాలను, గ్రీన్ పార్టీ 3 స్థానాలను గెలుచుకోగా ఒక స్థానంలో మాత్రం స్వతంత్ర్య అభ్యర్థి గెలిచాడు. 
 
మొత్తం 338 స్థానాలు ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 170 స్థానాలలో విజయం సాధించాలి. లిబరల్ పార్టీ బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ మద్దతు కోరగా ఆ పార్టీ లిబరల్ పార్టీకి మద్దతు ఇవ్వటానికి ఆసక్తి చూపలేదు. అందువలన ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ ఎన్.డీ.పీ పార్టీ కింగ్ మేకర్ గా అవతరించింది. 24 పార్లమెంట్ స్థానాలలో విజయం సాధించిన జగ్మీత్ సింగ్ ఎన్.డీ.పీ పార్టీ పాత్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రస్తుతం కీలకంగా మారింది. 
 
జగ్మీత్ సింగ్ ప్రధాని ట్రుడోకు చెందిన లిబరల్ పార్టీకి మద్దతు ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎన్.డీ.పీ పార్టీ 44 సీట్లను సాధించింది. గతంతో పోలిస్తే ఈసారి సీట్ల సంఖ్య తగ్గినా ఎన్.డీ.పీ పార్టీ కింగ్ మేకర్ గా అవతరించడం విశేషం. జగ్మీత్ సింగ్ మాట్లాడుతూ కెనడా పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచటం కొరకు తీసుకోవాల్సిన చర్యలు మరియు కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించటం తమ సభ్యుల ముందున్న ప్రధాన లక్ష్యమని చెప్పారు. 
 
లిబరల్ పార్టీకి చెందిన ప్రధాని ట్రుడో ప్రస్తుతం మైనార్టీలో ఉన్నారనే వాస్తవాన్ని గౌరవిస్తారని భావిస్తున్నామని జగ్మీత్ సింగ్ అన్నారు. కెనడా ప్రజలు ప్రభుత్వం తమకోసం పని చేయాలని కోరుకుంటున్నారని జగ్మీత్ సింగ్ అన్నారు. పంజాబ్ రాష్ట్ర ప్రజలు ప్రధాని ట్రుడో గతంలో తన క్యాబినేట్ లో నలుగురు సిక్కులకు చోటు కల్పించటంతో కెనడా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కొరకు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నలుగురిలో ముగ్గురు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించగా ఒకరు మాత్రం ఓడిపోయారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: