పీఓకేలో పాకిస్తాన్ మానవహక్కుల్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. ఇప్పటి వరకూ పౌరులపై దాష్టీకం చూపించిన పాక్ పోలీసులు.. ఇప్పుడు జర్నలిస్టులకు కూడా చుక్కలు చూపించారు. నడివీధిలో పరిగెత్తించి రక్తాలు కారేలా కొట్టారు. ముజఫరాబాద్ లో ప్రెస్ మీట్ కు వచ్చిన జర్నలిస్టుల్ని పాక్ ఖాకీలు టార్గెట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 


కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తేనే.. మానవ హక్కులకు భంగమని గగ్గోలు పెడుతున్న పాకిస్థాన్.. పీఓకేలో అమానుషానికి పాల్పడింది. నిరసన తెలుపుతున్న స్థానికులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్న పాక్ పోలీసులు.. ఆందోళనను కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై కూడా ప్రతాపం చూపించారు. దీంతో పీఓకేలో అసలేం జరుగుతుందో మరోసారి ప్రపంచానికి తేటతెల్లమైంది. 


పీఓకేలోని ముజఫరాబాద్‌లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు నిరసనలకు దిగారు. సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దౌత్యాధికారులను, జర్నలిస్టులను పాక్ ప్రభుత్వం పీఓకే సమీపంలోని నియంత్రణ రేఖ వద్దకు తీసుకెళ్లిన రోజునే ఆందోళన జరగడం.. ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ముజఫరాబాద్‌ పోలీసులు రెచ్చిపోయారు. తొలుత ఒక మీడియా సమావేశానికి వచ్చిన పాత్రికేయులను లాఠీలతో చితకబాదారు. రోడ్లపై తరిమి తరిమి కొట్టారు. కిందపడినా వదల్లేదు. దీంతో ఒక్కసారిగా ఆ  ప్రాంతంలో అలజడి రేగింది. 


పాత్రికేయులనే కాదు.. సామాన్య జనాలను కూడా రక్తాలు కారేలా కొట్టారు పోలీసులు. కాల్పులు జరిపారు. రౌడీల మాదిరి రోడ్లపై ప్రవర్తించారు పోలీసులు. కనిపించిన వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు జర్నలిస్ట్‌లు. వాస్తవానికి ఇటీవల కాలంలో ముజఫరాబాద్‌లో తీవ్రస్థాయిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వాటిని తీవ్రంగా అణిచివేస్తున్నారు పాక్‌ పోలీసులు. ఇదే క్రమంలో జరుగుతున్న ఒక ప్రెస్‌మీట్‌ను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు పాక్‌ పోలీసులు. మొత్తానికి జర్నలిస్టులపై జరిగిన దాష్టికంపై పాత్రికేయుల లోకం మండిపడుతోంది. లాంటి ఘటనలు జరుగడంపై ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: