భారత్‌పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం జరుగుతుందా.. అనే స్థాయిలో కాల్పులు జరుగుతున్నాయి. కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి సై అంటున్న అమెరికా రెండు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది. పాక్ వైఖరే ఈ పరిస్థితులకు కారణమని తేల్చింది.


భారత్‌పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది అమెరికా. ఇరు దేశాలు శాంతియుత వాతావరణంలో చర్చలు జరపాలని సూచించింది. అటువంటి చర్చలకు తాము మద్దతిస్తామని స్పష్టం చేసింది అమెరికా. అలాగే పాకిస్థాన్‌ తీరును తీవ్రంగా ఎండగెట్టింది అగ్రరాజ్యం. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ సహకరిస్తోందని... అదే చర్చలకు పెద్ద అవరోధంగా మారిందని కుండ బద్దలుకొట్టింది.  


అమెరికా విదేశాంగ శాఖ సబ్‌ కమిటీకి అందజేసిన నివేదికలో ఆసియాపసిఫిక్‌ విభాగం అధిపతి అలైస్ జి వెల్స్‌ ఈ విషయాల్ని ప్రస్తావించారు. 2006, 2007లో జరిగిన చర్చల్లో కాశ్మీర్‌ సహా పలు అంశాల్లో మంచి పురోగతి కనిపించిందన్నారు. తిరిగి మళ్లీ అటువంటి వాతావరణం నెలకొనాలంటే... ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చర్చలతోనే భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలకు తెరపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది అమెరికా.  


పాకిస్థాన్‌ అగ్గిమీద గుగ్గిలంగా మారడానికి కారణమైన ఆర్టికల్‌ 370 రద్దు విషయంలోనూ అమెరికా నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఆర్టికల్‌ 370 రద్దును చేసి కాశ్మీరు అభివృద్ధికి కృషి చేయాలన్న భారత్‌ లక్ష్యాన్ని అమెరికా స్వాగతించింది. అలాగే కాశ్మీరు లోయలో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు మోడీ సర్కార్‌ తీసుకుంటున్న చర్యల్ని అభినందించింది. అక్కడ సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయనే ఆశాభావం వ్యక్తం చేసింది అగ్రరాజ్యం. 


మరోవైపు... పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోయాయని, సామాన్యులతో పాటు మీడియాపైనా దాడులు ఎక్కువవుతున్నాయి స్పష్టం చేసింది. మైనార్టీలపై మతపరమైన దాడులు జరుగుతున్నాయని తేల్చి చెప్పింది. రాజ్యాంగం ప్రకారం పౌరులకు స్వేచ్ఛ కల్పించాలని స్పష్టం చేసింది అమెరికా.


పాకిస్థాన్‌ నేతలు, దేశ భద్రతపై బాధ్యతయుతంగా విమర్శలు చేస్తున్న పష్తూన్ తహఫుజ్‌ మూవ్‌మెంట్‌ వంటి సంస్థలను అణగదొక్కాలని చూడటాన్ని ఖండించింది అమెరికా. అటువంటి  సంస్థలు సమావేశాలు ఏర్పాటు చేసుకునేలా అనుమతులు ఇవ్వాలని సూచించింది. అలాగే కొన్ని ప్రభుత్వేతర సంస్థలకు పాక్‌ పాలకులు ఇస్తున్న అనుమతులపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. ఈ సంస్థలు పాక్‌ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న అధికారిక సంస్థలను అడ్డుకుంటున్నాయని తెలిపింది. మరీ ముఖ్యంగా ఐ.ఎమ్.ఎఫ్ నిబంధనలకు కట్టుబడి ఉంటేనే ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందని పాకిస్థాన్‌కు స్పష్టం చేసింది అమెరికా.  

మరింత సమాచారం తెలుసుకోండి: