తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయ్. శ్రీశైలం ప్రాజెక్టు జలసిరిని సంతరించుకుంది. కర్ణాటక ఎగువ  ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు భారీగా వరద వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టుల్లోకి వరద నీటి రాకపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ బిరాబిరా పరుగులు తీస్తోంది. ఎగువ నుంచి 2.55 లక్షల క్యూసెక్కుల వరదనీరు  పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 208.72 టీఎంసీల నీరుంది. పూర్తి స్థాయి నీటిమట్టం  885 అడుగులు కాగా ప్రస్తుతం 883.8 అడుగుల మేరకు నీరు చేరుకుంది. దీంతో 68 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.  అటు శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.


జోగులాంబ గద్వాల జిల్లాలోని తుంగభద్ర నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. అల్ప పీడన ద్రోణి ప్రభావంతో కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద పోటెత్తుతోంది. దీంతో డ్యాం 33 గేట్లు ఎత్తి లక్షా 55 వేల 431 క్యూసెక్కులు నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో లక్షా 55 వేల 431 క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 100.663 టీఎంసీల  నీటి నిల్వ ఉంది.


మరోవైపు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఉప్పొంగుతున్న గోదారమ్మతో  జలాశయం పులకించిపోతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. అధికారులు గేట్లను ఎత్తి నీటిని  దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్.ఆర్.ఎస్.పి పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90.313 టీఎంసీలు కాగా.. నీటినిల్వ పూర్తిస్థాయిలో ఉంది. ప్రాజెక్టుకు  ఇన్ ఫ్లో 45 వేల 500 క్యూసెక్కులుండగా.. ఔట్ ఫ్లో కూడా 45 వేల 500 క్యూసెక్కులుగా నమోదవుతోంది. ఈ జలదృశ్యాన్ని చూసేందుకు  స్థానికులు భారీగా తరలివస్తున్నారు.


మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి ప్రాజెక్ట్‌లన్నీ పూర్తిగా నిండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూడేళ్ల తరువాత ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు  వదులుతున్నారు. దిగువకు నీటి విడుదల కొనసాగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని  గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు అధికారులు  సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: