కొందరు యువకులు చేసే పిచ్చి పిచ్చి పనులవల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇలాంటి వారివల్ల అటు డిపార్ట్‌మెంట్‌కే గాక పేరున్న నాయకులు గాని తారలకు గాని చాలా చిక్కులు ఎదురవ్వుతాయి. ఇప్పుడు ఓ యువకుడు ఆ నాయకుడిపై తనకున్న అభిమానాన్ని ఊహించలేని రేంజ్‌లో చాటుకున్నాడు. కాని ఆ అభిమానం చాటున అతని స్వార్ధం కూడా ఉంది. ఇక అతనికున్నది అభిమానమో, పిచ్చో మరేదో కావచ్చు కాని అదే అతనికి ఇప్పుడు చిక్కులు తెచ్చింది. అసలు జరిగిన విషయం ఏంటంటే


పిఠాపురానికి చెందిన ముప్పిడి హరి రాకేశ్ (27) కూకట్ పల్లిలోని బాలాజీనగర్‌లో నివాసం ఉంటూ.. జీడిమెట్లలో వ్యాపారం చేస్తున్నాడు. కాగా ఇతను పిఠాపురం ప్రాంతానికి చెందిన తమ బంధువు కారును నగరానికి తీసుకొచ్చి వాడుకుంటున్నాడు. ఆ కారు నంబర్ AP 10 BD 7299 ఇంతవరకు బాగానే వుంది కానీ కారు నంబర్ ప్లేట్ మీద ‘ఏపీ సీఎం జగన్’ అని ముందు, వెనకాల రాయించాడు. ఇకపోతే అక్టోబర్ 19న సాయంత్రం జీడిమెట్ల పైపులైను రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తున్న జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ కంట ఈ కారు పడటంతో కారును ఆపి, వివరాలు సేకరించగా.. కారు తమ బంధువుదని.. పిఠాపురం నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు టోల్ గేట్ ఫీజు, ఇతర చెకింగ్‌ల నుండి తప్పించుకోవడానికి అలా రాశానని రాకేశ్ చెప్పాడు.


ఇక ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కేసును జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కారు స్వాధీనం చేసుకుని రాకేశ్ ను అరెస్ట్ చేయడంతో పాటు కారు ఓనర్ యేసురెడ్డిపై కూడా కేసు నమోదు చేసారు.. ఇకపోతే ఏపీ సీఎం జగన్ పట్ల యూత్‌లో ఉన్న క్రేజ్ తో.. బైక్‌ల మీద జై జగన్ లాంటి స్లోగన్లు రాసుకోవడం చూశాం. కానీ ఈ యువకుడు ఏకంగా కారు నంబర్ ప్లేట్ మీద ఏపీ సీఎం జగన్ అనే రాసుకొవడం ఇప్పుడు హట్ టాపిక్‌గా మారింది. ఈ పనిని అతను తెలిసి చేసాడా తెలియక చేసాడా అనే విషయాన్ని పక్కన పెడితే ఇలాంటి పని చేయడం పెద్ద నేరం కింద పరిగణిస్తారు. ఇక ఇతని పిచ్చిని, తెలివిని  చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియక దిక్కులు చూస్తున్నారు ఈ విషయం తెలిసినవారు.


మరింత సమాచారం తెలుసుకోండి: