హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం రేపు వెల్లడి కానుంది.  ఉప ఎన్నిక ఫలితం పై రాష్ట్ర వ్యాప్తంగా  సర్వత్రా ఉత్కంఠ  నెలకొంది. గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా,  ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు .   పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు పూర్తికాగానే, ఈవీఎం  ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు.  మొత్తం ఇరవై రెండు రౌండ్లు ఓట్ల  లెక్కింపు కొనసాగనుంది.  ఒకొక్క  రౌండ్ కు  14 టేబుల్స్ ఏర్పాటు చేశారు.  ప్రతి టేబుల్ కు మైక్రో అబ్జర్వర్,  కౌంటింగ్ సూపర్వైజర్,  కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు.  ఎన్నికల బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు ఉండడంతో ఫలితం వెల్లడి కావడానికి కాసింత ఆలస్యం అయినప్పటికీ,  ఉదయం 10 గంటలకే ట్రెండ్స్  తెలిసే అవకాశాలు ఉన్నాయి .


 ఇప్పటికే వివిధ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు టీఆర్ఎస్ ఘన విజయం సాధించే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఫలితం ఎలా ఉండబోతుందో నని లోలోన మాత్రం మధనపడుతున్నారు .  ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడినప్పుడు నియోజకవర్గం లో  టిఆర్ఎస్ పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ,  ఈనెల 5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టిన తర్వాత క్రమేపీ మారుతూ  వచ్చింది.


  ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్  ఎంతోకొంత ఉంటుందని టిఆర్ఎస్ నాయకులు కూడా అంగీకరిస్తూనే ఉన్నారు . అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాలే తమ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ని  గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు.  అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉత్తమ్ పద్మావతి గెలుపు ఖాయమని అంటున్నారు .  టిఆర్ఎస్,  కాంగ్రెస్ పార్టీ అద్భ్యర్థుల  మధ్యే ప్రధాన పోటీ ఉండగా  , బీజేపీ , టీడీపీ అభ్యర్థులు ధరావతు దక్కించుకుంటారా ? లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది .

 


మరింత సమాచారం తెలుసుకోండి: