పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై విష ప్రయోగం జరిగిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ఆయన కుమారుడు హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఐతే... తొలుత ప్లేట్ లెట్ కౌంట్  పడిపోయిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా విష ప్రయోగం జరిగి ఉంటుందనే వార్తలతో అసలు ...నవాజ్ షరీఫ్ అనారోగ్యానికి కారణం ఏంటనే దానిపై చర్చలు మొదలయ్యాయి. 


పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను లాహోర్‌లోని ది సర్వీస్‌ ఆసుపత్రిలో చేర్చారు. విషప్రయోగం చేయడం వల్లే ఆయన ఆరోగ్యం దెబ్బతిందని షరీఫ్‌ కుమారుడు హుస్సేన్‌  ఆరోపించారు. దీనిపై ఇమ్రాన్‌ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని డిమాండ్‌ చేశారు. వివిధ కేసుల్లో దోషిగా తేలడంతో నవాజ్‌ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సోమవారం రాత్రి సర్వీస్‌ ఆసుపత్రికి  తరలించారు.


ఐతే...తన తండ్రిపై విషప్రయోగం చేశారని షరీఫ్ కుమారుడు హుస్సేన్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. విష ప్రయోగానికే ఆయన ప్లేట్‌లెట్ల సంఖ్య 16 వేలకు పడిపోయిందని హుస్సేన్ తెలిపారు. షరీఫ్  ప్రమాదకర స్థితిలో ఉన్నారని వైద్యులు చెప్పినట్లు ఆయన వివరించారు. అనారోగ్యానికి గురైతే సరైన సమయంలో ఆయన్ని ఆసుపత్రికి తరలించలేదని విమర్శలు గుప్పించారు హుస్సేన్. ఇందుకు ఇమ్రాన్‌ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం  చెప్పి తీరాలి అని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం నవాజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు వైద్యులు.


నవాజ్ షరీఫ్‌ ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోవడంతో వైద్యుల సూచన మేరకు ఆయనను సోమవారమే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయనకు వైద్య పరీక్షల్లో డెంగ్యూ లేదని తేలినట్టు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో వెల్లడించింది. నవాజ్ షరీఫ్ ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువగా ఉందని ఆయన వ్యక్తిగత వైద్యుడు అద్నాన్ ఖాన్ తెలిపారు. పలు అనారోగ్య కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందని చెప్పారు. ఆరోగ్యపరంగా ఆయన అనేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు అని  స్పష్టం చేశారు అద్నాన్ ఖాన్. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్ కుమారుడు హుస్సేన్ తన తండ్రిపై విష ప్రయోగం జరిగిందని ఆరోపించటం పలు అనుమానాలకు తావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: