హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ చేపడతారు. ఉప ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మెజారిటీ ఎంతనేది హాట్‌టాపిక్‌గా మారింది.  హోరాహోరీగా సాగిన హుజూర్‌నగర్ ఉపఎన్నికల పోరులో విజేత ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఉప పోరులో మొత్తం 28 మంది బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 21న పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలతోపాటు ఎన్నికల సామాగ్రిని పటిష్ట బందోబస్తు నడుమ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లోని స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఉప ఎన్నికలో 84.76 శాతం ఓటింగ్ జరిగింది. 


ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ దగ్గర కేంద్ర పారామిలటరీ బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. చుట్టూ సీసీ కెమెరాలు పెట్టారు. కౌంటింగ్‌ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. ఇక్కడి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు ఎస్పీ భాస్కరన్‌. మొత్తం 22 రౌండ్లలో జరిగే కౌంటింగ్‌కు.. ఒక్కో రౌండ్‌లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.  ప్రతి టేబుల్‌కు  ఒక మైక్రో అబ్జర్వర్‌,  సూపర్‌వైజర్‌తోపాటు మరో ముగ్గురు సహాయకులు ఉంటారు. రిటర్నింగ్‌ అధికారితోపాటు జిల్లా కలెక్టర్‌, EC నియమించిన ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు చేపడతారు. కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో జరగనుంది.


అనుమతి ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతిస్తారు అధికారులు. ఇందుకోసం ప్రత్యేకంగా పాస్‌లు జారీ చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2 లక్షల 754 ఓట్లు పోలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మండలానికి 5 పోలింగ్‌ కేంద్రాల చొప్పున వీవీప్యాట్‌లలో ఉన్న స్లిప్‌లను లెక్కిస్తారు.  మొత్తానికి హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితాలు అధికార, ప్రతిపక్ష వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: