మహారాష్ట్ర, హర్యానాలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు దగ్గరగానే  ఫలితాలుంటాయా? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ రేపు ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు. మహారాష్ట్ర, హర్యానాలో వార్‌ వన్‌సైడేనా? ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారు? ఓట్ల లెక్కింపుతో ఈ  ప్రశ్నకు సమాధానం దొరకనుంది. మహారాష్ట్రలోని 288, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 21న పోలింగ్‌ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో కాషాయ కూటిమి తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి ఎగ్జిట్‌ పోల్స్‌. 


మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమిగా బరిలో దిగాయి. ఒక్క ఇండియా టుడే మినహా జాతీయ చానళ్ల ఎగ్జిట్స్‌ పోల్స్‌లో కాషాయ కూటమికి 200లకు పైగా సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. కాంగ్రెస్‌, ఎన్సీపీలు  పెద్దగా ప్రభావం చూపలేదన్నది ఎగ్జిట్‌ పోల్స్‌ సారాంశం.  హర్యానాలో బీజేపీ మునుపటి కంటే బలపడుతుందని తెలిపాయి. ఇండియా టుడే తొలుత వార్‌ వన్‌సైడ్‌ అన్నా.. తర్వాత హర్యానాలో నెక్‌ టు నెక్‌ ఫైట్‌గా అంచనా వేస్తోంది. ఏదిఏమైనా మధ్యాహ్నానికి ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఎవరో క్లారిటీ వచ్చేస్తుంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 145, హర్యానాలో 46 స్థానాలు రావాలి. 


2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలంటే ఈసారి మహారాష్ట్ర, హర్యానాల్లో ఓటింగ్‌ శాతం తగ్గింది. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ఎత్తేసిన తర్వాత జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఈ అంశమే ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. దీనికితోడు ఎన్నికలకు ముందు ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. ఇది కూడా హాట్‌టాపిక్‌గా మారింది. బీజేపీ, సేన కూటమి తమ విజయం నల్లేరుపై నడకేనని ధీమాగా ఉంది. అయితే బీజేపీకి ఓటమి తప్పదని ఘంటా పథంగా చెబుతున్నారు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఓటరు తీర్పు ఏమిటో తెలియడానికి మరి కొన్ని గంటలు వేచి చూడక తప్పదు. 
ఈ రెండు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ , రెండు లోక్‌ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కూడా ఈడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: