తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా....అన్ని గ్రామాల రూపురేఖ‌ల‌ను మార్చేందుకు ఇటీవ‌లే....పల్లె ప్రగతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన ముఖ్య‌మంత్రి దానికి కొన‌సాగింపుగా మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. పంచాయతీలకు ప్రతినెలా విడుదల చేసే రూ.339 కోట్లతో ట్రాక్టర్లను కొనుగోలు చేయాలన్న సీఎం కేసీఆర్ సూచన మేరకు వీలైనంత త్వరగా ట్రాక్టర్లను కొనుగోలు చేయాలని, నవంబర్‌లోగా ప్రతి పంచాయతీలో ట్రాక్టర్లు వినియోగంలో ఉండాలని పంచాయతీరాజ్‌శాఖ ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. 


పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బంది నియామకంలో ట్రాక్టర్ డ్రైవింగ్ వచ్చినవారు కచ్చితంగా ఉండాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 500లోపు జనాభా ఉన్న పంచాయతీకి 15 హెచ్‌పీ, 501 నుంచి మూడువేల లోపు జనాభా ఉన్న పంచాయతీకి 20, 21 హెచ్‌పీ, మూడు వేలకుపైగా జనాభా కలిగిన పంచాయతీకి 35 హెచ్‌పీ నుంచి ఆపై కెపాసిటీ గల ట్రాక్టర్ ఉండాలని వెల్లడించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణకు వీలుగా ట్రాక్టర్ ట్రాలీని రెండు అరలుగా విభజించాలని సూచించారు. హరితహారం మొక్కల సంరక్షణకు వాటర్ ట్యాంకర్ కొనుగోలు చేయాలని ఆదేశించారు.


గ్రామాల్లో రహదారులపై గుంతల చదును, పిచ్చి మొక్కల తొలగింపునకు ట్రాక్టర్ బ్లేడ్‌ను కూడా కొనుగోలు చేయాలన్నారు. ట్రాక్టర్ల కొనుగోలు కోసం జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటుచేయాలని, ఆ కమిటీకి కలెక్టర్ ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. కన్వీనర్‌గా జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో), డీఆర్‌డీవో, జిల్లా పరిశ్రమల అధికారి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి ఈ జిల్లా స్థాయి కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏ పంచాయతీకి ప్రభుత్వం సూచించిన ట్రాక్టర్లు ఎంత కెపాసిటీవి అవసరమో గుర్తించేపనిలో పంచాయతీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.పంచాయతీ పాలకవర్గం, కార్యదర్శులతో సమావేశమై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ట్రాక్టర్ కొనుగోలుకు పంచాయతీనిధులు ఉన్నయా? లేకుంటే బ్యాంకు నుంచి అప్పు తీసుకొని తిరిగి చెల్లింపులు జరుపడంపై సమాలోచనలు చేస్తున్నారు. వీటిపై పంచాయతీల నుంచి నివేదిక అందాక ట్రాక్టర్ల కొనుగోలుపై బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: