నిన్న బస్ భవన్ లో ఎండీ సునీల్ శర్మ ఏర్పాటు చేసిన ఈడీల కమిటీ భేటీ అయింది. హైకోర్టు చెప్పిన 21 అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా దీర్ఘకాలంలో పరిష్కరించే సమస్యలు, ఇప్పటికిప్పుడు పరిష్కరించే సమస్యలు ఏవి అనే అంశాన్ని కమిటీ పరిశీలించింది. ఆర్టీసీ యాజమాన్యం పరిధిలో పరిష్కారమయ్యేవి, ప్రభుత్వ పరిధిలో పరిష్కారమయ్యేవిగా విభజించి డిమాండ్ల గురించి కమిటీ చర్చించింది. 
 
ఆరోగ్యశ్రీ సౌకర్యాన్ని కల్పించడం, ఆసరా పెన్షన్ల అందజేత, తెల్ల రేషన్ కార్డులివ్వడం, ప్రైవేట్ వాహనాల అక్రమ రవాణాను అరికట్టడం, అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం బస్సులు నడపడం, పీఎఫ్, ఎస్ జీ టీ ట్రస్టుల విభజన, కండక్టర్ మరియు డ్రైవర్ ఉద్యోగ భద్రతకు మార్గదర్శకాల రూపకల్పన ప్రభుత్వ పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలుగా కమిటీ సమావేశంలో గుర్తించింది.ఆసరా పెన్షన్లు, ఆరోగ్యశ్రీ డిమాండ్లు ఆర్థికపరమైన డిమాండ్లు కాబట్టి ఈ రెండు డిమాండ్ల గురించి సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 
 
మిగతా డిమాండ్లు మాత్రం ఆర్టీసీ యాజమాన్యం సులభంగానే పరిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. కమిటీ సమావేశంలో కార్మికులకు రావాల్సిన డీఏ బకాయిలు, డబుల్ డ్యూటీలకు రెట్టింపు వేతనాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆసరా పెన్షన్లు, కార్మికుల ఉద్యోగ భద్రత, వైద్య ఖర్చుల కొరకు పీఎఫ్ సొమ్ము నుండి రుణాలు తీసుకునే వెసులుబాటు, తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషలిటీ ఆస్పత్రిగా చేసే అంశంపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. 
 
డ్రైవర్లు డ్యూటీలు మారే చోట విశ్రాంతి గదుల ఏర్పాటు, మహిళలకు ఆరు నెలల ప్రసూతి సెలవులు, గ్యారేజీతో సహా అన్ని విభాగాలలో ఔట్ సోర్సింగ్ విధానం రద్దు, కరీంనగర్ మరియు హైదరాబాద్ జోన్ లకు ప్రత్యేకంగా ఈడీ నియామకం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్టోర్లను ఏర్పాటు చేయటం, విడి భాగాలను మరియు పరికరాలను స్టోర్లకు సరఫరా చేయటం మొదలైన అంశాల గురించి కమిటీ చర్చించినట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: