ఏపి ప్రభుత్వం ఇసుక కొరత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి గ్రామ సచివాలయాల్లోనే ఇసుక రవాణా పర్మిట్లు ఇచ్చేలా ఆదేశాలు జారి చేసింది. ఇందులో భాగంగా ఏరులు, వాగులు వంకలలో ఇసుక తవ్వకాలు, రవాణాను క్రమబద్ధీకరిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకటి నుంచి మూడు ఆర్డర్‌ స్ట్రీమ్స్‌గా పరిగణించే వంకలు, వాగులు, ఏరులలో ఇసుకను స్థానిక అవసరాలకు విస్తృతంగా వాడుకునేలా చూడటం ద్వారా తాత్కాలికంగా కొరతను అధిగమించేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.


ఇకపోతే ఒకటి నుంచి మూడు ఆర్డర్‌ స్ట్రీమ్స్‌లో ఇసుక తవ్వకాలు, వినియోగానికి సంబంధించి తాజాగా రూపొందించిన మార్గదర్శకాలు మూడు నెలల పాటు అమల్లో ఉంటాయని, తర్వాత సమీక్షించి అవసరమైన మార్పు చేర్పులు చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా గ్రామ సచివాలయాలవారీగా జిల్లాల్లో ఈ తరహా ఇసుక రీచ్‌లు ఎన్ని ఉన్నాయో గుర్తించే బాధ్యతను కలెక్టర్లకే అప్పగించింది. ఇందులోని ఇసుకను స్థానిక అవసరాలకు మాత్రమే వినియోగించుకునేలా గ్రామ సచివాలయాల సిబ్బంది పర్యవేక్షిస్తారు.


ఇకపోతే భారీగా ఇసుక లభించే గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార, పెన్నా లాంటి పెద్ద నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో తవ్వకాలకు వీలు లేనందున ఏర్పడిన కొరతను వంకలు, ఏరులు, వాగుల ద్వారా అధిగమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా ట్రాక్టర్లలో రేవు నుంచి 20 కిలోమీటర్లకు మించి ఇసుకను తీసుకెళ్లరాదు. ఎవరూ అవసరానికి మించి ఇసుక నిల్వ చేయరాదు. ఇలాంటివన్ని చూడాల్సిన బాధ్యత గ్రామ సచివాలయ అధికారులకు అప్పగించింది.. ఇకపోతే ఇసుక కావాల్సిన వారు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేలా గ్రామ సచివాలయంలో సిబ్బందికి డబ్బులు చెల్లించి రవాణా పర్మిట్‌ తీసుకోవాలి.


సచివాలయ అధికారి ఒరిజినల్‌ పర్మిట్‌ను ఇసుక బుక్‌ చేసుకున్న వారికి ఇచ్చి మరో కాపీని సచివాలయంలోనే ఉంచుతారు. ఇక ఈ పర్మిట్‌ 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. నిర్దిష్ట సమయంలోగా ఇసుక తీసుకెళ్లకుంటే పర్మిట్‌ చెల్లుబాటు కాదని తెలిపారు. ఒకవేళ పాస్‌ లేకుండా ఇసుక తరలిస్తే జరిమానా విధిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏరులు, వాగులు, వంకలలో, ఇసుక తవ్వకాలు, సరఫరాకు ఈ తరహా కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు అధికారులు. కాబట్టి ఇకనుండి ఇసుక సమస్య పూర్తిగా పరిష్కారం కానుంది తెలిపారు..


మరింత సమాచారం తెలుసుకోండి: