ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ.. దీనికి సమాధానం ఇప్పటివరకూ అమరావతి అని చెప్పేవారు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాజధానిని మారుస్తారని వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఊహాగానాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టే మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్లు చేస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రాజధానిని మంగళగిరికి మార్చమని ఎమ్మెల్యే ఆర్కే జగన్ కు లేఖ కూడా ఇచ్చారు.


ఇప్పుడు మళ్లీ తాజాగా.. మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. అవినీతికి, దోపిడీకి తావులేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండే మంచి రాజధాని నిర్మిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు హర్షించే రీతిలో రాజధాని మా ప్రభుత్వ హయాంలోనే కట్టి తీరుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలోకి ఉండి అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టలేకపోయారని విమర్శించారు.


రాష్ట్ర రాజధాని రాష్ట్ర ప్రజలకు చిరకాలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, 13 ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఈ ప్రభుత్వం కాంక్షిస్తుందన్నారు. రాష్ట్ర రాజధాని దేశంలోనే మేటిగా ఉండాలని భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం రాజధాని అన్నారు. మా ప్రభుత్వం వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతుందన్నారు. మంచి రాజధాని నిర్మించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయమన్నారు.


ఇందుకోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని, రాష్ట్రమంతా పర్యటించి అందరి మనోభావాలు తెలుసుకుంటారని చెప్పారు. కమిటీ ఏదైతే నిర్ణయిస్తే అక్కడే రాజధాని నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మా ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గం కోసం కాదని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ.. అంటే రాజధానిని మారుస్తున్నామని చెప్పినట్టా.. లేక అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పినట్టా అర్థం కాకుండా ఉంది. మరి ఆ కమిటీ ఏం చెబుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: