మాజీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ కు తన వియ్యంకుడి భూములు పోతాయన్న బాధ ఒక్కటే ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాజధాని గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో రాజధాని కోసం కేవలం రూ.5 వేల కోట్లే ఖర్చు చేశారని బొత్స అన్నారు. గ్రాఫిక్స్‌ పేరుతో ప్రజలను మభ్యపెట్టారన్నారు.


చంద్రబాబు వియ్యంకుడికి రాజధాని ప్రాంతంలో 500 ఎకరాలు కొనుగోలు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేసింది నిజం కాదా అన్నారు. నీ మంత్రులు, చుట్టాలు, తాపేదారులకు లబ్ధి చేకూర్చింది వాస్తవం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ బాధంతా ఒక్కటే అని, తన వియ్యంకుడికి ఇచ్చిన భూములు పోయాయనే అన్నారు.


లక్ష కోట్ల ప్రజాధనాన్ని ఫణంగా పెట్టిన చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పది అబద్ధాలు చెబితే జనం నమ్ముతారని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రచార ఆర్భాటం కోసం చంద్రబాబు, ఆయన కుమారుడు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని దుయ్యబట్టారు. మా ప్రభుత్వానికి పూర్తి క్లారిటీ ఉందని, చంద్రబాబు, ఆయన కుమారుడికి మాత్రమే క్లారిటీ లేదన్నారు. ఆదాయానికి ఎవరికి సృష్టించారని ప్రశ్నించారు.


హైదరాబాద్‌లో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటని నిలదీశారు. రింగ్‌రోడ్డుకు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి నిర్మించారు. ఏయిర్‌పోర్టును కూడా వైయస్‌ఆరే కట్టించారని తెలిపారు. చిన్న రాయి వేస్తే అది చంద్రబాబు గొప్పా అన్నారు. ప్రజలకు అన్ని తెలుసు అని, ఎవరు ఏవేవి కట్టారో అందరికి గుర్తుందన్నారు. చంద్రబాబులో ఎందుకు అసహనం, ఆక్రోశం ఉందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆయన ఆవేదన, అక్రోశం చూస్తే బాధేస్తుందన్నారు. మూడు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తూ చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: