మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువ‌డ‌నున్న‌ సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలతో పాటు మీడియా వర్గాలు ఈ ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. ఫలితాల వెల్లడికి ముందే రెండు రాష్ట్రాల్లోనూ బిజెపి తిరుగులేని విజయం సాధిస్తుందన్న అంచ‌నాలు స్పష్టంగా వెలువడటంతో బీజేపీ శ్రేణుల్లో ఎక్కడాలేని ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ తో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం బిజెపి ఘన విజయం సాధిస్తుందని చెప్పడంతో ఆ పార్టీ నేతలు ముందే సంబరాలు చేసుకుంటున్నారు. 


ఇక గురువారం ఫలితాలు వెల్లడి కావడంతో బుధవారం రాత్రి ముంబైలోని పార్టీ ఆఫీసులో నేతలు ల‌డ్డూలు సిద్ధం చేసుకున్నారు. మహారాష్ట్రలో ఫలితం తమకు అనుకూలంగా వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని, బీజేపీ రికార్డు మెజారిటీతో విజయం సాధిస్తుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు హ‌ర్యానాలోనూ అదే ప‌రిస్థితి నెల‌కొంది. హ‌ర్యానాలో త‌మ పార్టీ బంప‌ర్ మెజార్టీతో విజ‌యం సాధిస్తుంద‌ని భావిస్తోన్న బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఎక్క‌డిక‌క్క‌డ సంబ‌రాల‌కు రెడీ అవుతోంది. ఢిల్లీ బీజేపీ కార్యాల‌యంలో అయితే ఎన్నిక‌ల ముగిసిన 21వ తేదీ సాయంత్రం నుంచే ఆ పార్టీ నేత‌ల్లో ఫుల్ జోష్ నెల‌కొంది.


ఇదిలా ఉంటే ఫలితాలు వెలువడక ముందే స్వీట్లు సిద్ధం చేసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు అతి విశ్వాసంతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, మహారాష్ట్ర ఎన్నికల్లో కమలం పార్టీ కంగుతినడం ఖాయమని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. వాస్త‌వంగా చూస్తే కీల‌క‌మైన మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో ఫ‌లితాల‌కు ముందే కాంగ్రెస్‌, శివ‌సేన కూట‌మి పూర్తిగా డీలాప‌డిపోయింది. ఆ పార్టీ కీల‌క నేత‌లు సైతం ప్ర‌చారం చేయ‌లేదు. సోనియా ప్ర‌చారానికి దూరంగా ఉండ‌గా... రాహుల్ ప్ర‌చారం చేయ‌కుండా విదేశాల‌కు చెక్కేయ‌డంతో కాంగ్రెస్ ముందే చేతులు ఎత్తేసిన‌ట్ల‌య్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: