మాజీ సీఎం చంద్రబాబు ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారంలో కోల్పోయి ఆరు నెలలు కాకముందే.. మళ్లీ అధికారంపై మమకారం కలిగే మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్ ను గెలిపించిన ప్రజలు తప్పు చేశామని భావిస్తున్నారని అంటున్నారు. ఈ డైలాగులు సహజంగానే వైసీపీ నేతలకు కోపం తెప్పిస్తున్నాయి.


ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విషయం తెలిసిందే.. ఆయన చంద్రబాబుపై ఒంటి కాలిపై లేస్తుంటారు. అందుకే ఈ విషయంపై కూడా ఘాటుగా స్పందించారు. ప్రజలు మళ్లీ తననే కోరుకుంటున్నారని కలువరిస్తున్న చంద్రబాబు కుప్పం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి గెలవాలని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు.


"ప్రజలంటే కుల మీడియా అధిపతులు, మీ బంధుగణం, మోచేతి నీళ్లు తాగే చెంచాలు కాదు చంద్రబాబు గారూ. 13 జిల్లాల్లోని ఐదు కోట్ల మందిని ప్రజలు అని అంటారని పేర్కొన్నారు. కుప్పం నుంచి మళ్లీ మీరు గెలిస్తే.. నిజంగానే ప్రజలు మిమ్మల్ని కలవరిస్తున్నారని భావిస్తారంతా' అని ట్వీట్ చేశారు.


నాలుగు నెలల్లోనే సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 80 శాతం హామీలను నెరవేర్చారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 'వంశ పారంపర్యం అర్చకత్వానికి ఆమోదం తెలపడం ద్వారా ఆలయాలపైన ఆధారపడి జీవిస్తున్న వేలాది అర్చక కుటుంబాలకు వైయస్‌ జగన్ భరోసా కల్పించారని తెలిపారు. గతంలో కూల్చేసిన ఆలయాలు, ప్రార్థనా స్థలాలన్నిటినీ పునర్నిర్మించే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు.


అయితే విజయసాయిరెడ్డి ఈ సవాల్ చేయడం వైసీపీకి అంత శ్రేయస్కరం కాదనే చెప్పాలి.. అసలే రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న చంద్రబాబు దీన్ని అవకాశంగా మలచుకున్నా మలచుకుంటారు. విజయసాయి సవాల్ స్వీకరిస్తున్నాని ప్రకటిస్తూ ఆయన రాజీనామా చేస్తే రాజకీయం రసకందాయంలో పడుతుంది. అప్పుడు ఒకవేళ చంద్రబాబు గెలిస్తే.. వైసీపీకి ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి ఈ సవాల్ కు చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: