ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా వరాలు ప్రకటిస్తున్నారు. ప్రధానంగా సామాన్యులు, బడుగు వర్గాలపై దృష్టి సారించారు. అందులో భాగంగానే.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం, నివారణపై ప్రత్యక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొదటి దశలో రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన, సబ్‌ ప్లాన్‌ ప్రాంతాల్లోని గర్భవతులు, ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని పెంచుతూ పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నామని చెప్పారు.


డిసెంబర్‌ నుంచి పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నామని తెలిపారు. గర్భవతులు, బాలింతలకు నెలకు రూ.1062 విలువైన ఆహారం, 25 రోజుల పాటు రోజూ భోజనం, గుడ్డు 200 మిల్లీలీటర్ల పాలు, రూ.500 విలువ చేసే వైయస్‌ఆర్‌ బాల సంజీవని కిట్‌, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులకు నెలలో ప్రతి రోజు గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, వైయస్‌ఆర్‌ బాలామృతం కిట్‌, మొత్తంగా రూ.600 విలువైన పౌష్టికాహారం ప్రభుత్వం అందించనుంది.


అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నెలకు 25 రోజులు పౌష్టికాహారం, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రతి రోజు భోజనం, గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, పోషకాలు ఇచ్చే మరో అల్పాహారం, నెలకు రూ.560తో పౌష్టికాహారం ప్రభుత్వం అందించనుంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు.


క్షేత్రస్థాయిలోకి వెళ్లి పిల్లలు ఏం తింటున్నారో పరిశీలించాలని, ఎలాటి మార్పులు చేయాలో సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. పోషకాహారంలో నిపుణులైన వారి సలహాలు తీసుకోవాలన్నారు. బుధవారం పోషకాహారంపై సీఎం సమీక్ష నిర్వహించారు. జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: