సీనియర్ నటీమణి అంజలీదేవి (86) సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని విజయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు అమె అసలు పేరు అంజనీ కుమారి, స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం. అంజలీదేవి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సుమారు 400లకు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో వెండితెర సీతగా అంజలీ పేరుతెచ్చుకున్నారు. అంజలీ దేవి చివరిగా 1994లో తీసిన పోలీస్ అల్లుడు చిత్రంలో నటించారు. ఆమె నిర్మాతగా భక్తతుకారం, చండిప్రియ, అనార్కలి చిత్రాలు నిర్మించారు. వెండితెర సీతగా వెలుగొందిన అంజలీదేవి తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు. 1928 ఆగస్ట్ 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దపురంలో అంజలీదేవి జన్మించారు. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. 'గొల్లభామ' సినిమాతో అంజలీదేవి చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణరావును ఆమె వివాహం చేసుకున్నారు. ‘లవకుశ’ సినిమాలోని సీత పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాగే ఆమె నటించిన కీలుగుర్రం, సువర్ణసుందరి, అనార్కలి లాంటి చిత్రాల్ని, అందులోని ఆమె నటనను తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోలేరు. అంజలీదేవి మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. అవయవ దానం కోసం అంజలీ దేవి భౌతికకాయాన్ని చెన్నై రామచంద్రా మెడికల్ కళాశాలకు పంపారు. అంజలీ దేవి అనగానే అలనాటి పౌరాణిక చిత్రాలే గుర్తుకొస్తాయి. అనార్కలీగా, సీతగా.. ఇలా పలుపాత్రలకు ఆమె జీవం పోశారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల సరసన అత్యధిక సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటించారు. అక్కినేని, నందమూరిల సరసన హీరోయిన్‌గానే కాకుండా వారికి తల్లిగా కూడా కొన్ని సినిమాల్లో నటించడం ఓ విశేషం. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అంజలీదేవికి 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2006లో రామినేని అవార్డు, 2007లో ప్రతిష్టాత్మకమైన అక్కినేని నాగేశ్వరరావు అవార్డులు లభించాయి. అంజలీదేవి అంత్యక్రియలు ఎప్పుడన్నది తెలియరాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: