వెన్నులో వణుకు పుట్టిస్తున్న రాహుల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటే సొంత పార్టీకి వెన్నులో వణుకు పుడుతోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో నువ్వా నేనా అని తలపడాల్సిన యువనేత రాహుల్ గాంధీ తీరు వివాదాస్పదమవుతోంది. ఈ మధ్య ఆయన ప్రత్యర్థులతో కన్నా సొంత పార్టీ వారితోనే ఎక్కువగా తలపడుతున్నారు. స్వపక్షంలోనే విపక్షనేత పాత్రను పోషిస్తూ.. పార్టీ నేతలకు మింగలేని, కక్కలేని పరిస్థితిని కల్పిస్తున్నారు. రానున్న ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలని తల్లడిల్లుతున్న కాంగ్రెస్ నేతలకు.. ఇప్పుడు రాహుల్ తీరుతో కొత్త భయం పట్టుకుంది. కాంగ్రెస్ ఇప్పటికి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ పేరును తెరపైకి తెచ్చేందుకు సాహసం చేయలేకపోతోంది. పది ఏళ్ల యూపీఏ పాలన పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరసన.. మరో వైపు మోడీ ప్రభంజనం కాంగ్రెస్ కు ఊపిరి ఆడనివ్వడం లేదు. నిజానికి ఈ సదస్సులో రాహూల్ పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్టు కనపడుతోంది.  ఏడాది క్రితం జైపూర్ లో రాహుల్ కు ఉపాధ్యక్షుడిగా తెరపైకి తెచ్చిన..ఆయన ధాటిగా ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. ఈ ఏడాది కాలంలో ఆయన సాధించిన విజయాల కంటే.. ఆయన మూటకట్టుకున్న విమర్శలే ఎక్కువ. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు రాష్ట్రాల్లో చావు దెబ్బ తగిలింది. దీంతో ఉలిక్కి పడ్డ ఏఐసీసీ కొంతమంది సీనియర్లను మంత్రి పదవుల నుంచి తప్పించి పార్టీ పదవులు అప్పగించినా ఫలితం శూన్యం. గందరగోళం మధ్య ప్రధాని అభ్యర్ధి ప్రకటించడం కన్నా.. రాహూల్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు మాత్రం పార్టీ సిద్ధమైంది. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అవుతోంది. తాజాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ కి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించారు. ఎమెర్జెన్సీ తర్వాత నెహ్రూ ఫ్యామిలీ ఇంత క్లిష్టపరిస్థితిని ఎదుర్కోవడం ఇదే తొలిసారి. మోడీ జెట్ స్పీడ్ లా దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ మాత్రం ధైర్యం చేయలేకపోతోంది. ఇటువంటి విషమ పరిస్థితుల్లో ఏఐసీసీ సదస్సులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే విషయమే ఇప్పుడు హాట్ టాపిక్.

మరింత సమాచారం తెలుసుకోండి: