అవినీతిని నిర్మూలించడానికి నేనున్నానంటూ ముందుకొచ్చిన పార్టీ.. ఆమ్ ఆద్మీ. ప్రత్యామ్నాయ రాజకీయ విలువలను సృష్టిస్తామని గొప్పటు చెప్పుకున్న ఆప్ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. దీంతో.. ఆమ్ ఆద్మీ కూడా ఇతర పార్టీల అడుగుజాడల్లోనే నడుస్తోందంటూ..పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఆప్ దారితప్పుతుందని అంటున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం రోజు తామూ సామాన్యులమే అని చెప్పుకోవడానికి ఆప్ నేతలు మెట్రోలో వచ్చారు. అది మినహా, ఆ తర్వాత వారు మెట్రోను ఉపయోగించలేదు. మంత్రి రాఖీ బిర్లా ప్రభుత్వ వాహనాన్ని తీసుకోగానే, తాము బుగ్గ కార్లను తీసుకోబోమని చెప్పాం కానీ, ప్రభుత్వ కార్లను కాదని ఆప్ సమర్థించుకుంది. సీఎం కేజ్రీవాల్‌ తన కోసం పది బెడ్‌రూంల ఇంటిని తీసుకొని, విమర్శలు రావడంతో దానిని వద్దనుకున్నారు.  ఇవన్నీ ఒకత్తైతే... మంత్రి సోమ్‌నాథ్‌ భారతి తీరు మరొక ఎత్తు. ఢిల్లీలోని పలు ప్రదేశాల్లో వేశ్యవృత్తి, డ్రగ్స్ దందా జరుగుతోందని ఆరోపిస్తూ అర్థరాత్రి సమయంలో సోమ్ నాథ్ దాడులు చేశారు. ఈ సమయంలో పలువురు ఆఫ్రికా మహిళలను ఆయన కించపరుస్తూ మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బీజేపీ నేత అరుణ్‌ జైట్లీ, సీనియర్ న్యాయవాది హరీష్‌ సాల్వేలను ఉద్దేశించి... వారి మొహాల మీద ఉమ్మేయాలని ఉందని సోమ్‌నాథ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఆయన మీడియాపై ఆరోపణలు సంధించారు. జాతీయ మహిళా కమిషన్‌ ముందు హాజరు కాకపోవడంపై తనను ప్రశ్నలడిగిన మీడియాను 'మోడీ మీకు ఎంత ఇచ్చాడని' ప్రశ్నించారు.దీంతో మీడియా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. తామడిగే ప్రశ్నలకు సమాధానం లేకనే ఆయన మీడియాను విమర్శిస్తున్నాడని ఆరోపించాయి. దీంతో వెంటనే సోమ్‌నాథ్‌ ప్లేటు తిప్పేసారు. తన మాటల వల్ల ఎవరైనా బాధ పడి ఉంటే క్షమించమని కోరారు. మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇతర పార్టీలకు ఏ మాత్రం తీసిపోదని ఆ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యే వినోద్‌ కుమార్‌ బిన్నీ ఆరోపించారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుంటే ఈనెల 27 నుంచి దీక్ష చేపడతానని హెచ్చరించారు.సోమ్‌నాథ్‌, బిన్నీల విషయంలో ఆప్ ఏదో ఒక స్టాండ్‌ను తీసుకోకపోతే... త్వరలోనే ఆ పార్టీపై కూడా ప్రజలకు అనేక సందేహాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: