తనిష్క్ జువెలర్స్ లో దొంగ వెలుగులోకి వచ్చాడు. తానే ఆ జువెలర్స్ లో దొంగతనం చేశానని అంటూ కిరణ్ కుమార్ అనే యువకుడు పోలీసుల ముందుకు వచ్చాడు. తను సంచలనం కోసమే దొంగతనం చేశానని అతడు చెప్పుకొంటున్నాడు.ఇంతే కాదు ఈ కిరణ్ కుమార్ ఎన్నో విచిత్రమైన వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. రాజకీయాలు, దొంగతనం రెండూ ఒకటేనని దొంగతనం ఎంత ఈజీగా చేయొచ్చో నిరూపించడానికే ఈ పనిచేశానని అతడు అంటున్నాడు. తను ఉద్యోగం కోసం చాలా ట్రై చేశానని , అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదని, అందుకే దొంగతనం చేశానని కిరణ్ అంటున్నాడు. మొదట్లో ఇతడు దొంగతనం చేశానని పోలీసుల ముందుకు వస్తే ఎవ్వరూ నమ్మలేదు. అయితే దొంగతనం చేసిన విధానం గురించి కూలంకషంగా వివరించడం, దొంగతనం చేసిన సొత్తు ఎక్కడ ఉందో చెప్పడంతో ఇతడే దొంగ అని నిర్ధారించారు పోలీసులు. తనిష్క్ జ్యువెలర్స్ లో చోరీకి గురైన మొత్తం రూ.5.97 కోట్ల సొత్తుగా యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొంది. మొదట్లో 23 కోట్ల రూపాయల విలువైన నగల దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశారు. అంతిమంగా 5.97 కోట్ల రూపాయలకు లెక్క తేల్చారు. ఈ విషయం గురించి "ఏపీ హెరాల్డ్'' పోలీసులను సందప్రదించింది. ఇంత భారీ స్థాయి దొంగతనాన్ని కిరణ్ ఒక్కడే చేశాడంటే నమ్మలేకపోతున్నామని వారు అంటున్నారు. అతడికి కచ్చితంగా ఎవరో సహకరించే ఉంటారని అంటున్నారు. అతడు తనంతకు తనే లొంగిపోవడంలో కూడా ఏమైనా లోగుట్టు ఉందా? అని వారు ఆరాతీస్తున్నారు. బహుశా ఆ నగలు ఎక్కడ అమ్మాలో, ఎలా అమ్ముకోవాలో తెలియక కూడా అతడు సంచలనం కోసం చేశానంటూ లొంగిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈ దొంగతనం కిరణ్ లొంగుబాటుతో ఆసక్తికరమైన మలుపు తీసుకొంది. కిరణ్ కుటుంబీకులు, స్నేహితులు కూడా అతడు దొంగతనం చేశాడంలే నమ్మలేకపోతున్నామని అంటున్నారు. దాదాపు ఆరు కోట్ల రూపాయల దొంగతనాన్ని చాలా సులువుగా చేసి, అంతే సులువుగా లొంగిపోయిన దర్జా దొంగ ఈ కిరణ్ కుమార్ అని చెప్పవచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి: